అందుకే ఇక్కడి పోతు ధర రూ.18 వేల నుంచి రూ.20 వేలు
అయినా కొంటున్న మాంసం ప్రియులు
బయట ప్రాంతాల జీవాల ధర రూ.12 వేలే
ఉదయగిరి మేకపోతులకు మార్కెట్లో భలే గిరాకీ ఉంటోంది. ప్రధానంగా ఇక్కడి దుర్గం పరిసరాల్లోని ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆకులను మేకపోతులు ఆహారంగా తీసుకోవడం వల్ల వీటి మాంసం రుచికరంగా ఉండడమే కాకుండా ఔషధాలతో నిండి ఉంటుందని పశు వైద్యులు కూడా నిర్ధారిస్తున్నారు.
ఉదయగిరి: ఉదయగిరి దుర్గంపైన, పరిసరాల్లో వేల సంఖ్యలో అనేక రకాల ఔషధ గుణాల మొక్కలు ఉన్నాయి. మేకలు, మేకపోతులు నిత్యం దుర్గంపై ఆయా రకాల మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. మేకపోతు పుట్టిన నాటి నుంచి కోతకు వచ్చే వరకు (5 నెలలు) నిత్యం ఉదయగిరి కొండల్లో తిరుగుతూ వివిధ రకాల ఔషధ ఆకులు, మొక్కలు తినడం ద్వారా వాటి మాంసంలో కూడా ఔషధ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇక్కడి మేకపోతుల మాంసం రుచి చాలా బాగుంటుంది. ఎక్కువ మంది వ్యాపారులు, మాంసం ప్రియులు ఉదయగిరి దుర్గంలో మేపే పోతులను అధిక ధర పెట్టి కొనేందుకు కూడా వెనుకాడడం లేదు.
ఆర్గానిక్ మాంసంగా భావిస్తారు..
దుర్గంపై ఉన్న ఔషధ గుణాలు కలిగిన మొక్కలను తినడం వల్ల మేకపోతులకు వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అందువల్ల ఇవి జబ్బున పడిన సందర్భాలు చాలా తక్కువ. పశు వైద్యశాలలో వాడే మందులు వాడకపోవడం, కృత్రిక ప్రొటీన్‌ను ఆహారంగా కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో ఔషధ గుణాలు కలిగిన మొక్కలను తినడం వల్ల ఆర్గానిక్ మాంసంగా భావిస్తారు.
10 కేజీల పోతు ధర రూ.18 వేల పైమాటే
ఒకప్పుడు ఉదయగిరిలోని హోటళ్లలో దుర్గం మేకపోతు మాంసం అని ప్రత్యేకంగా బోర్డులు పెట్టేవారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు కచ్చితంగా వాటి మాంసం రుచి చూసేవారు. అయితే ప్రస్తుతం ఈ మేకపోతులకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున స్థానిక హోటళ్లలో నిత్యం ఈ మాంసం దొరకడం లేదు. అనారోగ్యంతో బాధ పడేవారు పత్యం కోసం ఔషధ విలువలు కలిగిన దుర్గం మేకపోతులు కొనుగోలు చేస్తుంటారు. ఉదయగిరిలో ఉండే వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి బయట ప్రాంతం వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తుంటారు.10 కేజీల బరువు ఉండే ఉదయగిరి దుర్గంలోని మేకపోతు ధర రూ.18 వేల నుంచి 20 వేల వరకు పలుకుతోంది. అదే బయట ప్రాంతాలకు చెందిన మేకపోతు ధర రూ.12 వేలు వరకు కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు.
మాంసం చాలా రుచి
దుర్గంపల్లి, ఉదయగిరి బీసీకాలనీ, ఎస్సీ, ఎస్టీ కాలనీ చెందిన వారు మేకలను ఉదయగిరి దుర్గంలో మేపుతుంటారు. ఇక్కడ ఉన్న వివిధ రకాల ఔషధ మొక్కలు తిన్నందున మేకపోతుల మాంసం నాణ్యతగా ఉంటుంది. బయట జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి ఈ పోతులను అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తుంటారు. నేను కూడా ఇక్కడి పోతులను కొనుగోలు చేసి బయట విక్రయిస్తుంటాను.
– కె.తిరుపతయ్య,వ్యాపారి, ఉదయగిరి బీసీ కాలనీ
మేకపోతులకు డిమాండ్ ఎక్కువ
ఉదయగిరి మేకపోతులకు మార్కెట్లో భలే గిరాకీ ఉంటోంది. ప్రధామా దుర్గంపల్లిలో చాలా మంది మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మా మేకలు, మేకపోతులు ప్రతి రోజూ దుర్గంలో ఉన్న ఔషధ మొక్కలు తింటాయి. వీటి మాంసం కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఎక్కువ ధర చెల్లించి వ్యాపారులు మేకపోతులు తీసుకెళతారు. ఈ చుట్టుపక్కల వ్యాపారుల కంటే బయట జిల్లాల వ్యాపారులు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేస్తుంటారు.
– బకీరు వెంకటయ్య,దుర్గంపల్లి, ఉదయగిరి
మెడిసిన్ విలువలు ఉంటాయి
సాధారణంగా మేక జీవిత కాలం 10 నుంచి 12 ఏళ్లు ఉంటుంది. మేక 8 నెలల వయస్సు నుంచి చూడి కడుతుంది. 5 నెలలకు ఈనుతుంది. ఏడాదికి రెండు సార్లు మేకలు ఈనతాయి. ఒక్కొక్క ఈతలో రెండు పిల్లలు పుడతాయి. ఒక్కోసారి అంతకన్నా ఎక్కువ కూడా పుడతాయి. 5 నెలల మేకపోతు నుంచి సుమారు 10 నుంచి 12 కేజీల మాంసం లభిస్తుంది. దుర్గం ప్రాంతంలో ఉండే మేకలు, మేకపోతులు ఔషధ మొక్కలు, ఆకులు మేతగా తీసుకోవడం వల్ల మంచి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. వీటి మాంసంలో ఔషధ గుణాలు కలిగిన ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది.
– కొమ్మి కోటేశ్వరరావు, పశువైద్యులు
Comments
Please login to add a commentAdd a comment