స్థల వివాదంపై రెండో రోజూ ధర్నా
లింగసముద్రం: వివాదంలో ఉన్న స్థలం విషయంలో కోర్టు ఆదేశాలను అధికారులు పాటించడం లేదని జెడ్పీటీసీ సభ్యురాలు, కుటుంబ సభ్యులు రెండో రోజు కూడా శనివారం ధర్నా కొనసాగించారు. మండలంలోని పెదపవనిలో స్థల వివాదం నెలకొన్న నేపథ్యంలో ఘర్షణ జరగడంతో అధికారులు తమకు సహకరించడంలేదని జెడ్పీటీసీ డాక్టర్ చెన్ను నళిని పద్మ, ఆమె భర్త వైఎస్సార్‌సీపీ నాయకుడు డాక్టర్ చెన్ను ప్రసాద్, కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం ధర్నా కొనసాగించారు. వివాదాస్పద స్థలానికి కోర్టు స్టేటస్ కో ఇచ్చినా కొందరు ముస్లింలు శుక్రవారం స్థలానికి ఫెన్సింగ్ వేస్తున్నా.. అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ధర్నా కొనసాగిస్తామన్నారు. అయితే శనివారం ఉదయం తహసీల్దార్ సీతామహాలక్ష్మి ధర్నా నిర్వహిస్తున్న జెడ్పీటీసీ వద్దకు వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. వివాదాస్పదంగా ఉన్న స్థలం కోర్టులో ఉండగా తమ వారిపై దౌర్జన్యం చేసి ఫెన్సింగ్ ఎలా వేస్తారని, చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం వరకు ధర్నా కొనసాగడంతో కందుకూరు సబ్ కలెక్టర్ వివాదాస్పద స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అందులో ఎవరు ప్రవేశించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ఫోన్ ద్వారా చెప్పడంతో జెడ్పీటీసీ ధర్నా విరమించారు.
స్థలం వద్ద 164 బీఎన్‌ఎస్‌ఎస్
వివాదాస్పద స్థలం వద్ద 164 బీఎన్‌ఎస్‌ఎస్ విధించామని, గ్రామ సర్వే నంబర్ 439/1లో ఉన్న స్థలం కోర్టులో ఉందని, ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నించినా అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. దీంతో స్థలం వద్ద 164 బీఎన్‌ఎస్‌ఎస్ విధించడంతో పోలీసులు పహారా కాస్తున్నారు.
సబ్‌కలెక్టర్ హామీతో
ధర్నా విరమించిన జెడ్పీటీసీ
స్థలం వద్ద 164 బీఎన్‌ఎస్‌ఎస్ ఆంక్షలు
Comments
Please login to add a commentAdd a comment