ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు(బారకాసు): ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సాకారమవుతాయని కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. శనివారం నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి మద్రాసు బస్టాండ్ మీదుగా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. జిల్లా లోని 722 గ్రామ పంచాయతీలతోపాటు అన్ని మున్సిపల్ కేంద్రాల్లో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛత దివస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల మూడో శనివారం ప్రత్యేకంగా జరిగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మున్సిపల్, పంచాయతీ పారిశుధ్య కార్మికులు ప్రతి రోజూ విధులు నిర్వహిస్తూనే ఉంటారని, అయితే సమాజంలోని అన్ని వర్గాలు మన ఇంటిని, మన ఊరిని, మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు శ్రీకారం చుట్టాలన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పరిశుభ్రతగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారని తెలిపారు. మన ఇంటి నుంచి పరిశుభ్రతను ప్రారంభిస్తే, మన పిల్లలే ముందుకు తీసుకెళ్తారన్నారు. మార్చి 31 నాటికి జిల్లాలో ఏ ఒక్క మారుమూల గ్రామంలో కూడా బహిరంగ బహి ర్భూమి లేకుండా చూడాలని, ఇది అందరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. మన ఒంటిని, ఇంటిని, ఊరిని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ అన్నారు. ట్రంకురోడ్డు సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వివిధ వర్గాల ప్రజలందరితో కమిషనర్ సూర్యతేజ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, స్థానిక నాయకులు, పలు శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment