ఎన్టీఆర్ వర్ధంతికి ప్రముఖుల డుమ్మా
ఆత్మకూరు: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని ఆత్మకూరు పట్టణంలో ఆయన అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు.
ఆనం రామనారాయణరెడ్డి పట్టణంలోని కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారని.. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వారికే పనులు జరుగుతున్నాయని, దీనిపై కినుకు వహించిన కౌన్సిలర్లు, కొందరు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారని సమాచారం. పార్టీ అధికారంలో లేనప్పుడు సైతం భారీ స్థాయిలో అన్నదానాలు చేసిన వారందరు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
పీఎం ఇంటర్న్‌షిప్‌ను
సద్వినియోగం చేసుకోండి
నెల్లూరు రూరల్: యువతకు ఏపీపీఎస్‌డీసీ పీఎం ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ద్వారా ప్రముఖ కంపెనీలు, పరిశ్రమల్లో అవకాశాలను కల్పిస్తున్నారని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఖయ్యూంతో కలిసి పఖెం ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. 10వ తరగతి, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ బీఏ, బీఎస్సీ, బీఫార్మసీ, బీబీఏ కోర్సులు చదివి 21 నుంచి 24 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులని తెలిపారు.
మాలకొండలో హుండీ
కానుకలు లెక్కింపు
వలేటివారిపాళెం: జిల్లాలో ప్రసిద్ధ మాలకొండ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ కానుకలు శనివారం లెక్కించారు. రూ.11.75 లక్షల రాబడి వచ్చినట్లు ఆలయ ఈఓ సాగర్‌బాబు తెలిపారు. కుంకుమార్చన ద్వారా రూ.22 వేలు, తలనీలాలు రూ.54 వేలు, ప్రత్యేక దర్శనం రూ.4.69 లక్షలు, లడ్డూ ప్రసాదాలు రూ.1.65 లక్షలు, అన్నదానం కోసం రూ.3.85 లక్షలు, గదుల అద్దెల ద్వారా రూ.32 వేలు వచ్చినట్లు వివరించారు. నెల్లూరు జిల్లా దత్తలూరు మండలం రాచవారిపల్లికి చెందిన బడే మాల్యాద్రిరెడ్డి స్వామి వారి అన్న ప్రసాదానికి రూ.4 లక్షలు విరాళంగా చెల్లించినట్లు ఆలయ ఈఓ పేర్కొన్నారు. లెక్కింపు ఆలయ అధికారుల పర్యవేక్షణలో జరిగింది.
ఊపందుకున్న
నిమ్మ ధరలు
సైదాపురం: నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. ఇటీవల చలి ప్రభావంతో నిమ్మ ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు నిస్సహాయ స్థితిలో పడిపోయారు. అయితే మూడు రోజుల నుంచి నిమ్మ ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఒకింత ఆనందంలో మునిగిపోయారు. గూడూరు మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ.25 నుంచి రూ.35 వరకు పలుకుతున్నాయి. నాణ్యత కలిగిన కాయల ధర రూ.45 దాకా పలుకుతున్నట్టు రైతులు చెబుతున్నారు. శనివారం గూడూరు నిమ్మ మార్కెట్లో లూజు (50 కేజీ బస్తా) రూ.2,400 నుంచి రూ.3,300 వరకు కొనుగోలు చేస్తున్నారు. నిమ్మ ధరలు మరింత పెరగనున్నట్టు సమాచారం.
ఉమ్మాయపల్లిలో
అనుమానితులకు దేహశుద్ధి
మర్రిపాడు: మండలంలోని పెగళ్లపాడు పంచాయతీ ఉమ్మాయపల్లి గ్రామంలో శనివారం రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న 8 మంది వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గ్రామస్తులు వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పట్టుకుని తనిఖీ చేశారు. వారి వద్ద కోళ్లు, పసుపు, కుంకుమ, చలగపారలు, గడ్డపారలు కనిపించాయి. దీంతో వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారు క్షుద్రపూజల కోసం లేదా గుప్త నిధుల తవ్వకాల కోసం వచ్చి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment