![మద్దతు ధర లభించేలా పర్యవేక్షించాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05nlr131-240081_mr-1738781950-0.jpg.webp?itok=YG-xY-4T)
మద్దతు ధర లభించేలా పర్యవేక్షించాలి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభంకానున్న తరుణంలో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు తగ్గకుండా రైతులు విక్రయించుకునేలా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో తన చాంబర్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ – క్రాప్‌ను ఈ నెల 25లోపు పూర్తి చేయాలని సూచించారు. సీసీఆర్ కార్డులు పొందిన కౌలు రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా మంజూరు చేయించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ఎంపిక చేసిన ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీల్లో పురుగు మందు రహిత వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. దగదర్తిలోని పీఏసీఎస్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నామని డీసీఓ గుర్రప్ప చెప్పారు. పైలట్ ప్రాజెక్ట్‌గా మార్కెటింగ్, సహకార శాఖల ఆధ్వర్యంలో గోడౌన్లను ఏర్పాటు చేసి జాతీయ గోదాముల అభివృద్ధి ప్రాఽధికార సంస్థ గుర్తింపు పొందేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లాలో ఐదు వేల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ లక్ష్యం కాగా, ఇప్పటికే మూడు వేల ఎకరాల్లో అమర్చామని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు వివరించారు. జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు, పశుసంవర్థక శాఖ జేడీ రమేష్‌నాయక్, జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, ప్రకృతి వ్యవసాయ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత, మార్క్‌ఫెడ్ డీఎం పవన్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment