19 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు
నెల్లూరు (టౌన్): టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు సంబంధించిన లోయర్, హయ్యర్ గ్రేడ్, డ్రా యింగ్, టైలరింగ్ ఎంబ్రాయిడరీ పరీక్షలను ఈ నెల 19 నుంచి 22 వరకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హ్యాండ్లూమ్ వీవింగ్ ప్రాక్టికల్స్‌ను ఈ నెల 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నారని చెప్పారు. వివరాలకు www.bseap.org.inను సంప్రదించాలని సూచించారు.
ఇంటర్ ఒకేషనల్
ప్రాక్టికల్స్ ప్రారంభం
నెల్లూరు (టౌన్): ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్స్ బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్స్‌కు 284 మందికి గానూ 264 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 265 మందికి గానూ 19 మంది గైర్హాజరయ్యారు. బీవీనగర్‌లోని జీవీఆర్‌ఆర్ జూనియర్ కళాశాలను ఆర్‌ఐఓ శ్రీనివాసులు.. రెండు పరీక్ష కేంద్రాలను డీవీఈఓ మధుబాబు తనిఖీ చేశారు.
విద్యుత్ బిల్లు సవరింపు
ఆత్మకూరు: పట్టణంలోని ఓ సామిల్లుకు జారీ చేసిన అధిక విద్యుత్ బిల్లును ఆ శాఖ అధికారులు సవరించారు. ‘స్మార్ట్ మీటర్ గుండె గుబిల్లు’ అనే శీర్షికన సాక్షిలో కథనం బుధవారం ప్రచురితమవడంతో డీఈఈ శ్రీనివాసరావు ఆదేశాలతో ఏడీఈ చిన్నస్వామి, ఏఈ లావణ్య సంబంధిత సామిల్లులో పరిశీలించారు. స్మార్ట్ మీటర్ ఏర్పాటు సమయంలో జరిగిన సాంకేతిక సమస్యతో ఇలా బిల్లు నమోదైందని, దీన్ని సరిచేసి అందజేశామని ఏడీఈ తెలిపారు. స్మార్ట్ మీటర్ల కారణంగా బిల్లులు అధికంగా రావని, టారిఫ్ ప్రకారం వినియోగించిన యూనిట్లకు మాత్రమే వస్తుందని, ఎలాంటి అపోహలొద్దని చెప్పారు.
తెల్లరాయి లారీ పట్టివేత
వింజమూరు(ఉదయగిరి): తెల్లరాయిని అక్రమంగా తరలిస్తున్న లారీని వింజమూరులోని చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. దుత్తలూరు మండలం నుంచి చైన్నె వెళ్తుండగా, పట్టుకొని కేసు నమోదు చేసి మైనింగ్ అధికారులకు అప్పగించామని ఎస్సై వీరప్రతాప్ తెలిపారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట నుంచి బోగస్ పర్మిట్ల ద్వారా వీటిని తరలిస్తున్నారన్నారు.
సప్లిమెంటరీ పరీక్షలకు ఆరుగురి గైర్హాజరు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో బుధవారం నిర్వహించిన డిగ్రీ మెగా సప్లిమెంటరీ పరీక్షలకు ఆరుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారని వీఎస్‌యూ పరీక్షల నిర్వహణాధికారి మధుమతి తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన ఒకటో, నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 34 మందికి గానూ 28 మంది హాజరయ్యారని చెప్పారు.
విలీనాన్ని నిరసిస్తూ
ఆందోళన
ఆత్మకూరు రూరల్: మండలంలోని నాగులపాడులో గల ఎంపీపీఎస్ పాఠశాలలో మూడో, నాలుగో, ఐదో తరగతులను చెర్లోయడవల్లి ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసనను బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ సోమవరపు వెంకటరమణారెడ్డితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడారు. గుణాత్మక విద్యను అందిస్తున్నారని, ఈ క్రమంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చెర్లోయడవల్లి పాఠశాలలో విలీనం చేయడం సమంజసం కాదని చెప్పారు. మూడు కిలోమీటర్ల దూరంలోని చెర్లోయడవల్లికి రాకపోకలు సాగించేందుకు చిన్నారులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. విద్యాశాఖ అధికారులు స్పందించి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment