నెల్లూరు (టౌన్): జాతీయ రహదారిపైకెక్కాక ఇంటికి క్షేమంగా చేరుతామో, లేమోననే మీమాంస ఎంతో మందిని వెంటాడుతోంది. తామెంత జాగ్రత్తగా వాహనాలను నడిపినా, ఎదురుగా వచ్చే వారి ఏమరుపాటు వీరి ప్రాణాలను కబళిస్తోంది. నామమాత్రంగా మారిన రహదారుల నాణ్యత.. గుంతలను పూడ్చకుండా ప్యాచ్ వర్కులకే పరిమితం కావడం సైతం సమస్యకు పెనుభూతమవుతోంది. ప్రమాదకర మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏ మాత్రం కానరావడంలేదు.
ప్రమాద ప్రాంతాల గుర్తింపు
రహదారుల్లో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్న 54 బ్లాక్ స్పాట్లను రవాణా శాఖ, పోలీస్, ఆర్టీసీ, నేషనల్ హైవే అధికారులు గుర్తించారు. ఉలవపాడు – మనుబోలు జాతీయ రహదారిలో 45, నెల్లూరు – కడప జాతీయ రహదారిలో ఏడు, వెంకటగిరి – పామూరు జాతీయ రహదారిలో ఇలా రెండింటిని కనుగొన్నారు. ఇక్కడ ఇవే కాకుండా మరో 40.. స్టేట్ హైవేల్లో 32 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఆయా చోట్ల విద్యుత్ కాంతిని పెంపొందించే చర్యలు, స్పీడ్ బ్రేకర్లు, క్యాట్‌ఐస్ డ్రమ్ములు, సైడ్ బ్యారియర్స్, గుంతలను పూడ్చడం, సూచిక, వేగ పరిమితి బోర్డులను ఏర్పాటు చేయడం, రహదారిపైకి వచ్చిన చెట్ల కొమ్మలను తొలగించడం తదితరాలను చేపట్టాలని నేషనల్ హైవే అధికారులకు సూచించారు.
సమావేశం.. తూతూమంత్రం
కలెక్టరేట్లో రోడ్డు సేఫ్టీ సమావేశాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి నెలా నిర్వహిస్తారు. దీనికి రవాణా, పోలీస్, ఆర్టీసీ, నేషనల్ హైవే, మున్సిపాల్టీ, ఆర్ అండ్ బీ, వైద్య, ఆరోగ్య శాఖ, మార్కెటింగ్, పంచాయతీ తదితర శాఖల అధికారులు హాజరవుతారు. పలు అంశాలపై కలెక్టర్ సూచనలు చేస్తున్నా, సమావేశం అనంతరం ఆయా శాఖల అధికారులు ఈ అంశాన్ని విస్మరిస్తున్నారు. ఫలితంగా మీటింగ్ లక్ష్యం నీరుగారుతోంది.
పరిమితికి మించి ఆటోలో విద్యార్థుల తరలింపు
జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. రోడ్లపై ఏర్పడిన గుంతలు దగ్గరికి వచ్చేంత వరకు కనిపించకపోవడం.. ఆపై సడన్ బ్రేక్ వేస్తూ వెనుక వచ్చే వాహనాలు ఢీకొని ఎంతో మంది మృత్యువాతపడుతున్నారు. వాహనాలకు ఎల్‌ఈడీ బల్బులను వినియోగించకూడదనే నిబంధన ఏ మాత్రం పట్టడంలేదు. జాతీయ రహదారులపై సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు కానరావు. ఓవర్‌లోడ్ మినహా మరే ఇతర అంశాలపై తనిఖీలు చేపడుతున్న దాఖలాల్లేవు. జాతీయ రహదారులపై ఆటోలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తూ ప్రమాదాలకు కేంద్ర బిందువవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment