శ్రీ సత్యసాయి: మండలంలోని సొల్లాపురంలో ఓ దున్నపోతు రెచ్చిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ... తనను కొట్టిన వారిని గుర్తు పెట్టుకుని కుమ్మేస్తోంది. ఈ క్రమంలో అల్లీపీరా స్వామి భజన మందిరం వద్ద నివసిస్తున్న రసూలమ్మ బుధవారం ఉదయం ఇంటి బయట అరుగుపై కూర్చొని ఉండగా దున్నపోతు దాడి చేసింది. కొమ్ములతో ఎత్తి పారేసింది. ఘటనతో ఆమె కుడి కాలు పాదం నుంచి మోకాలి వరకూ చీరుకుపోయింది. దాడిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై దున్నపోతును తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన రసూలమ్మను అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
కసితో దాడి చేస్తున్న దున్న..
ఆరు నెలల క్రితం సొల్లాపురానికి చేరుకున్న దున్నపోతును గమనించిన స్థానికులు తొలుత అమ్మోరి పోతు అనుకున్నారు. ఈ క్రమంలో దానిని ఎవరూ ఏమి అనకుండా మిన్నకుండి పోయారు. గ్రామంలోనే సంచరిస్తూ దొరికిన ఆహార పదార్థానలు తింటూ వస్తున్న దున్నపోతు... మూడు నెలలుగా తన ధోరణిని మార్చుకుంది. ఇళ్ల ఆవరణలోకి ప్రవేశించి ఎండకు బెట్టిన గింజలను తినడం మొదలు పెట్టడంతో గమనించిన స్థానికులు దున్నపోతును అదలించేవారు. అయినా దున్నపోతు మొత్తం గింజలను తినేంత వరకూ అక్కడి నుంచి కదలకుండా ఉండడంతో కర్రతో కొట్టి తరిమేసేవారు.
దీంతో తనపై దాడి చేసిన వారు వీధుల్లో కనిపిస్తే దున్నపోతు రెచ్చిపోయి కుమ్మేస్తూ వచ్చింది. అప్పటి నుంచి దున్నపోతు వీధుల్లో కనిపిస్తే ప్రజలు భయపడి ఇళ్లలోకి చేరుకోసాగారు. మూడు నెలల్లో దాదాపు 60 మంది గ్రామస్తులు దున్నపోతు దాడిలో గాయపడ్డారు. అయితే తొలిసారిగా బుధవారం ఓ మహిళపై దున్నపోతు దాడి చేయడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు చోటు చేసుకున్నాయి. అధికారులు స్పందించి దున్నపోతును బంధించి, అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment