10 రోజుల్లో నిఖా.. అంతలోనే విషాద గీతిక | - | Sakshi
Sakshi News home page

10 రోజుల్లో నిఖా.. అంతలోనే విషాద గీతిక

Published Sun, May 19 2024 1:25 AM | Last Updated on Sun, May 19 2024 8:55 AM

-

లారీని కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి 

మరొకరికి గాయాలు 

వరుడి మృతితో రెండు కుటుంబాల్లో శోకం

ముక్కుపచ్చలారని పిల్లల మృత్యువాత

కన్నీరుమున్నీరైన బంధువులు

శోకసంద్రంలో మునిగిన బిందెలకాలనీ

వారిది చాలా పెద్ద కుటుంబం. ఆ ఇంటాయనది పెద్ద మనసు. తన తమ్ముడు చనిపోతే వారి కుటుంబాన్ని అక్కున చేర్చుకునిపోషిస్తున్నారు. పెద్ద కుమారుడు ఇటీవల చనిపోగా ఆ ఇంటి మనుషులకూ అండగా నిలబడ్డారు. పిల్లల ఆలనా పాలనా చూస్తున్నారు. ఇటీవల చిన్న కుమారుడి నిశ్చితార్థం జరిగింది. దీంతో ఆ కుటుంబమంతా ఎంతో సంతోషంలో మునిగిపోయింది. పెళ్లిని ఘనంగా చేయాలని నిశ్చయించింది. పెళ్లి పత్రికలను ఇప్పటికే చాలా మందికి పంచింది. ఎంతో ఆనందంగా ‘సాగిపోతున్నాం’ అనుకుంటున్న తరుణంలో వారిని వెంటాడిన మృత్యువు.. ఒక్కసారిగా అందరినీ విషాద సాగరంలోకి నెట్టేసింది. ప్రమాదంలో వరుడు కూడా చనిపోవడంతో రెండు కుటుంబాలూ, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

శ్రీ సత్యసాయి: మండలంలోని కరిడికొండ గ్రామ శివారు 44వ నంబర్‌ జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలవడంతో జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం నగరంలోని యల్లమ్మ వీధి బిందెల కాలనీకి చెందిన షేక్‌ అలీ సాహెబ్‌ (58) పామిడిలో గుజరీ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్ని రోజుల క్రితం తన తమ్ముడు మృతి చెందడంతో వారి కుటుంబాన్ని తన దగ్గరే ఉంచుకొని ఆలనాపాలన చూస్తున్నాడు. 

అదే విధంగా ఈ ఏడాది జనవరి 5న పెద్ద కుమారుడు రహంతుల్లా మృతి చెందగా, అతని భార్య షేక్‌ జాహిదాబాను (40), ఇద్దరు కుమారులు షేక్‌ మహమ్మద్‌ ఆహిల్‌ (6), షేక్‌ మహమ్మద్‌ అయాన్‌ (3)ను తనే పోషిస్తున్నాడు. కుమారుడు, కోడలు, మనవళ్లు, తమ్ముడి కుటుంబం కలసి 22 మంది ఒకే ఇంట్లో ఉంటున్నారు. అలీ సాహెబ్‌ చిన్న కుమారుడు షేక్‌ ఫిరోజ్‌బాషా (28) నగరంలోని ఓ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా కొన్ని రోజుల క్రితం వరకూ పని చేసేవాడు. గుజరీ వ్యాపారం చూసుకోవాలని తండ్రి సూచించడంతో బ్యాంకు ఉద్యోగం మానేశాడు. తండ్రితో కలిసి రోజూ పామిడికి వచ్చి వ్యాపారం చూసుకుని వెళ్లేవారు.

ఘనంగా నిశ్చితార్థం..
తమ బంధువులకు చెందిన ఓ యువతితో ఫిరోజ్‌బాషాకు వివాహం చేయాలని అలీ సాహెబ్‌ నిశ్చయించారు. ఈ నెల 3న నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28న వివాహాన్ని అత్యంత వైభవంగా చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే పెళ్లి బట్టలు, ఇతర వస్తువుల కొనుగోలు కోసం రెండు రోజుల క్రితం రెండు కార్లలో హైదరాబాద్‌ వెళ్లారు. షాపింగ్‌ ముగించుకున్న అనంతరం తిరుగుపయనమయ్యారు. ఒక కారులో అలీ సాహెబ్‌తో పాటు తమ్ముడి భార్య షేక్‌ రెహాన (44), కుమారుడు ఫిరోజ్‌బాషా, పెద్ద కోడలు షేక్‌ జాహిదాబాను, మనవళ్లు షేక్‌ మహమ్మద్‌ ఆహిల్‌, షేక్‌ మహమ్మద్‌ అయాన్‌ ఉండగా, మరో కారులో బంధువులు ఉన్నారు. బంధువులంతా శనివారం తెల్లవారు జాము 4 గంటలకే అనంతపురం వచ్చేశారు.

అయితే, మనవళ్లు షేక్‌ ఆహిల్‌, షేక్‌ అయాన్‌ ఏడుస్తుండటంతో తాము ప్రయాణిస్తున్న కారును అలీ సాహెబ్‌ కర్నూలులో ఆపించారు. వారు నిద్రపోయాక ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గుత్తి మండలం కరిడికొండ గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్‌ మహమ్మద్‌ గౌస్‌ నిద్రమత్తులో తూగడంతో కారు అదుపు తప్పి డివైడర్‌ ఎక్కి అవతలి వైపునకు వెళ్లి కర్నూలు వైపు వెళ్తున్న ఓ లారీని వేగంగా ఢీకొంది. ప్రమాదంలో అలీ సాహెబ్‌, ఫిరోజ్‌, మహమ్మద్‌ ఆహిల్‌, మహమ్మద్‌ అయాన్‌లు ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. 

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న షేక్‌ రెహానను గుత్తి ఆసుపత్రికి, షేక్‌ జాహిదాబానును అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు కూడా చికిత్స ఫలించక ప్రాణాలు విడిచారు. డ్రైవర్‌ గౌస్‌ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, గుత్తి సీఐ వెంకట్రామిరెడ్డి, ఎస్‌ఐ నబీరసూల్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. రక్తమోడుతున్న వారి ఎస్‌ఐ తన చేతులతో బయటకు తీశారు. ఫిరోజ్‌బాషా మృతదేహం బయటకు తీసే సమయంలో తల తెగి కింద పడిపోగా ఎస్‌ఐ తీసుకొచ్చి అంబులెన్సు సిబ్బందికి అందించారు. ఎస్‌ఐ చొరవను పలువురు అభినందించారు.

బిందెల కాలనీ కన్నీటి సంద్రం..
తమ కాలనీకి చెందిన ఆరుగురు మృతి చెందారనే వార్తతో బిందెలకాలనీ విషాదంలో మునిగిపోయింది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూకాలేదు. తమ వెనకే వస్తారనుకున్న వారు ఎంతసేపటికీ తిరిగిరాకపోవడం, ఆ క్రమంలోనే మరణవార్త తెలియడంతో కారులో ముందు వచ్చిన వారంతా ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

కుటుంబం మొత్తం మృతి..
అలీసాహెబ్‌ పెద్ద కుమారుడు రహంతుల్లా ఈ ఏడాది జనవరిలో మరణించగా, శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రహంతుల్లా భార్యతో పాటు ఇద్దరు కుమారులు మరణించారు. ఇక.. అలీసాహెబ్‌ భార్య గతంలోనే మృతి చెందగా, ఇప్పుడు చిన్న కుమారుడు, అలీ సాహెబ్‌ కూడా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

మారాం చేసి.. మరణించి..
షాపింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తున్న మరిదికి, మామకు బాయ్‌ చెబుదామని జాహిదా కారు వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె వెంట వచ్చిన కుమారులిద్దరూ తామూ వెళ్దామని మారాం చేయడంతో కాదనలేక పిల్లలతో కలిసి జాహిదా కారులో వెళ్లారు. ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలను కూడా మృత్యువు కబళించింది.

సోదరుడి కుమారుడి దత్తత..
తన సోదరుడు కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందగా, అతడి కుమారుడైన గౌస్‌ను అలీసాహెబ్‌ దత్తత తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును నడుపుతున్న గౌస్‌ కూడా గాయపడ్డారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement