తల్లీ... నిను వీడి ఉండలేను
పెనుకొండ రూరల్: తాను ఎక్కడున్నా.. కుమార్తెలు బాగుండాలని పరితపించాడు. వారి అభ్యున్నతి కోసం బాటలు వేశాడు. క్రీడలపై మక్కువ పెంచుకున్న పెద్ద కుమార్తెను జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగేలా ప్రోత్సహించాడు. ఈ శుభ పరిణామాన్ని భార్య, మరో కుమార్తెతో పంచుకుని సంబరపడాలనుకున్న ఆయన ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. బొలెరో రూపంలో దూసుకొచ్చిన మృత్యువు కుమార్తెను కబలించగా... కుమార్తె జ్ఞాపకాలతో తల్లీ... నిను వీడి నేను ఉండలేనంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తండ్రి కూడా మరణించాడు. ఈ ఘటనతో పెనుకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బిడ్డలే సరస్వమూ అనుకుని...
ధర్మవరానికి చెందిన రమేష్ రొద్దంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పీఈటీగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన విధులకు సౌకర్యవంతంగా ఉండేలా భార్య మల్లిక, కుమార్తెలు సాయి భవిత (15), తనుశ్రీతో కలసి పెనుకొండలో నివాసం ఏర్పరుచుకున్నారు. బిడ్డలే తన సరస్వంగా భావించిన తల్లిదండ్రులు వారిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. పెనుకొండలోని శాంతినికేతన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె సాయిభవితకు హాకీ క్రీడపై మక్కువ ఉండడంతో ఆ దిశగా ప్రోత్సహించారు. దీంతో క్రీడల్లో ఆమె రాణించి నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించే జిల్లా జట్టుకు ఎంపికై ంది. ఈ పోటీల్లో రాణించిన సాయి భవిత జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో దక్కించుకుంది. దీంతో ఎంతో సంతోషపడిన తండ్రి, కుమార్తె మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రైలులో ధర్మవరానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే పడుకుని బుధవారం ఉదయం పెనుకొండకు ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గ మధ్యంలో గుట్టూరు వద్ద వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ఘటనలో తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న సాయి భవితను బెంగళూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్(40) కూడా బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడు. విషయం తెలియగానే పెనుకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలను ధర్మవరానికి తరలించి అక్కడే అంత్యక్రియలకు బంధువులు ఏర్పాటు చేశారు.
బుధవారం చోటు చేసుకున్న ప్రమాదంలో తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలు
బెంగళూరుకు తరలిస్తుండగా
కుమార్తె మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
అర్ధరాత్రి తండ్రి కూడా...
Comments
Please login to add a commentAdd a comment