బానకచర్ల–గోదావరి ఎవరికోసం బాబూ?
హిందూపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన గోదావరి– బానకచర్ల లింకు ప్రాజెక్టు ఎవరి ప్రయోజనాల కోసం తెరపైకి తెచ్చారో రాయలసీమ ప్రజలకు వివరించాలని జలసాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. రూ.80 వేల కోట్ల వ్యయంచేసి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నుంచి రాయలసీమకు నీళ్లు ఇస్తానని చెప్పడం సీమ రైతులు, ప్రజలను మోసపుచ్చడమే అన్నారు. బుధవారం జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం వెంకటరామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చైతన్య గంగిరెడ్డి, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కేవలం 40 టీఎంసీల నీటి కోసం రూ. 80 వేల కోట్లు వెచ్చించే ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడం వెనక ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. దాని బదులు ఏటా కర్నూలు జిల్లాలోని కృష్ణానది నుంచి సముద్రంలో కలుస్తోన్న వందల టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించాలన్నారు. నిజంగా రాయలసీమ వాసులకు మేలు చేయాలంటే హంద్రీనీవా, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు.
ఆ జీఓలు రద్దు చేయాలి..
గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టు కాలువ వెడల్పు పనులకు రూ.6,182 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం తెలిపారని, దీనివల్ల సీమకు ఎంతో ప్రయోజనాలు కలిగేవని జనసాధన సమితి నేతలు అన్నారు. తాజాగా సీఎం చంద్రబాబు ఆ జీఓను రద్దుచేసి రాయలసీమ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. అంతేకాకుండా హంద్రీనీవా ప్రాజెక్టుకు మాల్యాల నుంచి జీడిపల్లి వరకు వెడల్పు పనులు తగ్గించి కేవలం 3,850 క్యూసెక్కులకు పరిమితం చేసి కాలువకు లైనింగ్ చేయడానికి సీఎం చంద్రబాబు 404, 405 జీఓలు తెచ్చి రాయల సీమ ప్రజలు, రైతులను అన్యాయం చేస్తున్నారని వాపోయారు. దీనివల్ల అనంతపురం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు ఇచ్చిన జీఓలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాయల సీమ రైతులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. కర్నూలు జిల్లా మల్యాల నుంచి జీడిపల్లి వరకు 10 వేల క్యూసెక్కులు, జీడిపల్లి నుంచి కిందకు 6 వేల క్యూసెక్కులు తీసుకునేలా హంద్రీనీవా కాలువలను వెడల్పు చేసి తగిన రిజర్వాయర్లు నిర్మించేందుకు బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని జలసాధన సమితి నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రెండేళ్లలో కాలువలు పూర్తి చేయాలన్నారు.
ఎంబీసీపై దృష్టి సారించాలి..
ప్రస్తుతం గొల్లపల్లి రిజర్వాయర్ నిండుకుండను తలపిస్తోందని, ఆ నీటిని మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా చెరువులకు మళ్లించేందుకు అవసరమైన పనులకు రూ. 1.50 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారని, వెంటనే ఆ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, పెనుగొండ నుంచి రాష్ట్ర కేబినెట్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి సవిత, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎంబీసీపై ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటిౖకైనా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హంద్రీనీవా కాలువలో పూడికతీత పనులను పూర్తి చేయించి, చెరువులకు నీళ్లు మళ్లించాలన్నారు. అలాగే ఈ ప్రాంతానికి మేలు జరిగేలా విభజన చట్టం మేరకు వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులను తీసుకు వచ్చి రాయలసీమ జిల్లాలను అభివృద్ధి చేయాలన్నారు. లేనిపక్షంలో పంజాబ్ రైతుల ఉద్యమ స్ఫూర్తితో జలసాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే వరకు రైతులు, ప్రజలు, విద్యార్థులతో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు సిద్దారెడ్డి, జలసాధన సమితి నాయకులు జమీల్, అమానుల్లా, ఉమర్ షారుఖ్, శ్రీరాములు, ఆదినారాయణ, నవీన్, తిప్పిస్వామి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.
700 కి.మీ నీటి తరలింపు సాధ్యమేనా?
చంద్రబాబును ప్రశ్నించిన జలసాధన సమితి, రైతు సంఘం నాయకులు
కృష్ణా జలాలను హంద్రీనీవాకు మళ్లించి సీమకు మేలు చేయాలని విన్నపం
Comments
Please login to add a commentAdd a comment