నూతన సందడి
కదిరి టౌన్/ఎన్‌పీకుంట/లేపాక్షి: నూతన సంవత్సరం తొలిరోజు బుధవారం ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. హిందూపురం, పుట్టపర్తి, మడకశిర, పెనుకొండ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామునే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరి పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులే కాకుండా పొరుగున ఉన్న వైఎస్సార్, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఖాద్రీశుని దర్శించుకున్నారు. సాయంత్రం వేళ మహిళలు ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
తిమ్మమ్మమర్రిమాను వద్ద కిటకిట..
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మమర్రిమాను ప్రాంతం బుధవారం పర్యాటకులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులంతా తిమ్మమాంబ అమ్మవారికి పూజలు నిర్వహించారు.
లేపాక్షికి పోటెత్తిన పర్యాటకులు..
ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం పర్యాటకులతో పోటెత్తింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. పర్యాటకులంతా ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించడానికి ఆసక్తి చూపారు. నాట్యమండపం, లతా మండపం, ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం, గర్భగుడి, నంది విగ్రహం, థీంపార్కు, జఠాయువు విగ్రహం తదితర ప్రాంతాల్లో పర్యాటకులు కిక్కిరిసి పోయారు. అనంతరం వారంతా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాములను ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటి చైర్మన్ కరణం రమానందన్ చొరవతో భక్తులకు అన్నదానం, మెడికల్ క్యాంపు, తాగునీరు. ఏర్పాటు చేశారు.
ఆలయాలకు పోటెత్తిన భక్త జనం
సందర్శకులతో పర్యాటక ప్రాంతాలు కిటకిట
Comments
Please login to add a commentAdd a comment