పింఛన్లపై పకడ్బందీగా విచారణ
ప్రశాంతి నిలయం: దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాల విచారణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్టబాబు, సెర్ఫ్ సీఈఓ వీరపాండియన్‌తో కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో పింఛన్ల విచారణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ టీఎస్ చేతన్ వీసీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా వైద్యఆరోగ్యశాఖ, డీఆర్‌డీఎ, గ్రామ,వార్డు సచివాయల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1,715 మంది దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టిన కేటగిరిలో రూ.15 వేలు చొప్పున ప్రతి నెలా పింఛన్ పొందుతున్నారన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆ పింఛన్‌లపై విచారణ నిర్వహించాలన్నారు. వైద్య బృందాల పరిశీలనకు సూక్ష్మ ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని, కలెక్టర్ అధ్యక్షతన, డీఆర్‌డీఎ పీడీ కన్వీనర్‌గా, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్, డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్, జిల్లా లెప్రసీ ఆఫీసర్, డీపీఓ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ, గ్రామ,వార్డు సచివాయల నోడల్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్‌శాఖ ప్రతినిధులు మెంబర్లుగా ఉంటారన్నారు. మండల స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వైద్యుడు.. రోగి వైకల్యాన్ని అంచనా వేస్తారని, ,గ్రామ వార్డు సచివాలయాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీఎంహెచ్‌ఓ ఫైరోజ్ బేగం తదితరులు పాల్గోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment