కానిస్టేబుళ్లపై ఎర్ర కన్ను
సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల ఉద్యోగులకు రాజకీయ రంగు పులిమారు. ఆయా స్థానాలకు తమ వారిని తెచ్చుకునేందుకు అప్పటికే అక్కడ ఉన్న వారిని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులనే బ్రాండ్ వేసి బదిలీ చేస్తున్నారు. పోలీసు విభాగంలో ఇన్నాళ్లూ సీఐ, ఎస్‌ఐల బదిలీల్లో కూటమి నేతలు చక్రం తిప్పారు. తమకు నచ్చిన వారిని తెచ్చుకునేందుకు ఉన్నవారికి స్థానచలనం కల్పించారు. కొందరికి రాజకీయ ముద్ర వేసి ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్‌లోనే ఉంచేలా చేశారు. ఇదిలా ఉండగా.. వారం రోజులుగా కొందరు కానిస్టేబుళ్లపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తూ కర్ణాటక సరిహద్దు స్టేషన్లకు బదిలీ చేయిస్తున్నట్లు తెలిసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో పని చేసే ఓ అధికారి నేతృత్వంలోనే బదిలీల ప్రక్రియ జరుగుతోందని సమాచారం. కూటమి నేతల సూచన మేరకు ఆ అధికారి.. జాబితా తయారు చేసి ఉన్న స్టేషన్ నుంచి దూర ప్రాంతాలకు బదిలీ చేసేందుకు శ్రీకారం చుట్టారట. ఇప్పటికే కొందరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడింది. ఏనాడూ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేసిన దాఖలాలు లేకున్నా.. గత ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలకు మద్దతు పలికారని ఆరోపిస్తే చాలు బదిలీ వేటు వేస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లలేక చాలా మంది కానిస్టేబుళ్లు ఇబ్బందులు పడుతున్నారు.
విధులు సక్రమంగా నిర్వర్తించడమే తప్పా?
విధి నిర్వహణలో భాగంగా ఆయా స్టేషన్ల పరిధిలో ఉన్నతాధికారుల సూచన మేరకు ఎన్నో ఏళ్లుగా సక్రమంగా నడుచుకున్న వారిని సైతం పక్కన బెట్టేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఇక్కడి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్‌కు పంపిస్తామని బెదిరిస్తున్నట్లు వాపోతున్నారు. ఇప్పటికే ధర్మవరం, హిందూపురం, కదిరి నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో చాలామంది కానిస్టేబుళ్లను రాజకీయ రంగు పూసి కక్షపూరితంగా బదిలీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సామాజిక సమీకరణాలతో పాటు సదరు ఉద్యోగి బంధువుల్లో ఎవరైనా వైఎస్సార్‌సీపీలో ఉన్నారంటే వెంటనే బదిలీ కావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.
ఆ అధికారే కీలకం
కానిస్టేబుళ్ల బదిలీల్లో ఎస్పీ కార్యాలయంలో పని చేసే ఓ అధికారి కీలకంగా మారని చెబుతున్నారు. ఆ సారు చెబితే సదరు కానిస్టేబుల్‌పై బదిలీ వేటు కచ్చితమని అంటున్నారు. దీంతో ఆ అధికారిపై చాలా మంది గుర్రుగా ఉన్నారు. కానీ ఆయన మాత్రం తన వద్ద ‘రెడ్’ బుక్ ఉందని చెప్పకనే చెబుతున్నారు. కొన్ని స్టేషన్ల పరిధిలో ఎస్‌ఐ, సీఐలను కాదని.. ఆయన చెలామణి అవుతుండటం విశేషం. చాలా స్టేషన్ల అధికారులు ఆయనపై జిల్లా పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదులు చేశారని సమాచారం.
సిబ్బంది అవస్థలు
పిల్లల చదువు, కుటుంబ భాగస్వామి ఉద్యోగం తదితర కారణాల రీత్యా ఓ ప్లానింగ్ ప్రకారం సాగిపోతున్న ఉద్యోగులపై ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నెత్తిన పిడుగులా పడుతోంది. ఉన్నఫలంగా అక్కడికి వెళ్లలేక.. మకాం మార్చలేక.. పిల్లల స్కూళ్లు వదలలేక.. నానా అవస్థలు పడుతున్నారు. ఎలాంటి సమస్య లేకున్నా.. కేవలం రాజకీయ కోణంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
పోలీసు సిబ్బందికి రాజకీయ రంగు
టార్గెట్ చేసుకుని సరిహద్దుకు బదిలీలు
గత ప్రభుత్వానికి అనుకూలంగా
పనిచేశారని ముద్ర
ఎస్పీ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ అధికారి
బదిలీలు సహజమే
వినతుల మేరకు కొన్ని బదిలీలు జరిగాయి. ఇంకొన్ని నిబంధనల ప్రకారమే చేశాం. ఎక్కడా రాజకీయ కోణం లేదు. ఎవరిపైనా కుట్ర జరగలేదు. బయట చెప్పే అవాస్తవాలు ఎవరూ నమ్మవద్దు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎలాంటి రెడ్ బుక్ లేదు. పోలీసుశాఖలో పని చేసే సిబ్బంది అందరూ ఒక్కటే. – వి.రత్న, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment