కార్యకర్తకు అండగా వైఎస్సార్‌సీపీ నాయకులు
నల్లచెరువు: నల్లచెరువు పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్భంధించిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తకు ఆ పార్టీ నాయకులు అండగా నిలిచారు. బుధవారం మండలంలోని కె.పూలకుంటకు చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త ఆంజనేయులు (అంజి వాల్మీకి) ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడనే కారణంగా బుధవారం నల్లచెరువు పోలీసులు అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్భంధించారు. విషయం తెలుసుకున్న కదిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్, సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఇన్‌చార్జ్ లింగాల లోకేశ్వర్‌రెడ్డి గురువారం డీఎస్పీ శివనారాయణస్వామితో మాట్లాడారు. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సోషల్ మీడియా కార్యకర్త అంజిని జామీనుపై బయటకు తీసుకొచ్చారు. వారితో పాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథనాయుడు, రైతు సంఘం నాయకుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు హైటెక్ రమణ, కళ్లిపల్లి శ్రీనివాసులు, రమణ, బాబూరెడ్డి, దొడ్డెప్ప, రామాంజనేయులు, ఆదిమూర్తి, ఎల్లారెడ్డి, సిద్దా ఆదెప్ప, రెడ్డెప్ప, తదితరులు ఉన్నారు.
భూ సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యలపై అవగాహన పెంపొందించుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలసి గ్రామ సభల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ, రెవెన్యూ గ్రామాల వారీగా గ్రామసభల షెడ్యూల్‌ను సిద్ధం చేయాలన్నారు. అనువైన స్థలాలను గుర్తించి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రామ సభ నిర్వహించాలన్నారు. గ్రామస్థాయిలో స్వీకరించే సమస్యలను సంబంధిత తహసీల్దార్లు, వీఆర్వోలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే ఆర్డీఓలు కూడా క్షేత్రస్థాయిలో తహసీల్దార్ల పనితీరుపై పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా డివిజన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరిగినా షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment