ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా?
పెనుకొండ రూరల్: ప్రశ్నిస్తే కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుండటం సరికాదన్నారు. ఇటీవల రొద్దం మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త బాలాజీరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అనంతరం నోటీసులతో విడుదల చేసినప్పటికీ విచారణల పేరుతో పోలీసులు వేధించడం సమంజసమా? అని ప్రశ్నించారు. అలాగే నల్లచెరువు మండలం కె.పూలకుంటకు చెందిన. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త, దినసరి కూలి ఆంజనేయులు ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయాలని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే బుధవారం అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమ నిర్భంధనలు ప్రజలను ఎన్నో రోజులు ఆపలేవన్నారు. ప్రతి కార్యకర్తకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వాల్మీకి సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ నరసింహులు, శ్రీకాంత్‌రెడ్డి, కొండలరాయుడు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
Comments
Please login to add a commentAdd a comment