సత్యసాయి జయంతికి ప్రత్యేక బస్సులు
పుట్టపర్తి టౌన్: సత్యసాయిబాబా 99వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 22, 23, 24 తేదీల్లో పుట్టపర్తి పట్టణానికి మహానగరాలతో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి మధుసూదన్ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో డిపో మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్ ఇన్ చార్జులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ రమేష్‌బాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ సత్యసాయి జయంత్యుత్సవాల నేపథ్యంలో హైదరాబాద్, చైన్నె, బెంగుళూరు, విజయవాడతో పాటు పలు ప్రాంతాల నుంచి తరలివచ్చే సత్యసాయి భక్తుల సౌకర్యార్థం 22, 23, 24 తేదీల్లో వంద ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామన్నారు. పుట్టపర్తి రైల్వేస్టేషన్ – పుట్టపర్తి 15, కొత్తచెరువు – పుట్టపర్తి– బుక్కపట్నం 15, ధర్మవరం రైల్వేష్టేషన్ – పుట్టపర్తి 15, కదిరి – పుట్టపర్తి 10, హిందూపురం– పుట్టపర్తి 10, పెనుకొండ– పుట్టపర్తి 5, అనంతపురం– పుట్టపర్తి 15, చైన్నె – పుట్టపర్తి 5, హైదరాబాద్– పుట్టపర్తి 5, బెంగుళూరు – పుట్టపర్తి 5 సర్వీసులు నడుపుతున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. రమేష్ బాబు మాట్లాడుతూ శ్రీసత్యసాయిని ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు డ్రైవర్లు, గ్యారేజ్ సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment