ఈ తీర్పు ఫైనల్‌ | - | Sakshi
Sakshi News home page

ఈ తీర్పు ఫైనల్‌

Published Sat, Nov 9 2024 12:54 AM | Last Updated on Sat, Nov 9 2024 1:12 AM

ఈ తీర

ఈ తీర్పు ఫైనల్‌

అనంతపురం: యువ దంపతుల మధ్య గొడవలు నెలకొన్నప్పుడు ఇరువైపులా పెద్దలు సమావేశమై వారికి నచ్చజెప్పి రాజీ కుదర్చడం చూస్తుంటాం. ఈ విధానం చాలా సందర్భాల్లో సమస్యని కోర్టు వరకు వెళ్లకుండా సామరస్యంగా సమిసిపోయేలా చేస్తుంది. ఈ పద్ధతినే అన్ని రకాల వివాదాలకూ వర్తింపజేస్తే బాగుంటుందన్న ఆలోచన నుంచి ‘మధ్యవర్తిత్వం’ విధానం వచ్చింది. ఈ అంశానికి తగిన ప్రాధాన్యతనివ్వడం ద్వారా న్యాయస్థానాల మీద కేసుల భారాన్ని తగ్గించవచ్చుని లోక్‌ అదాలత్‌లు నిరూపించాయి. ప్రతి సమస్యను కోర్టు ముంగిటకు తీసుకెళ్లకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే సమయంతో పాటు డబ్బూ ఆదా అవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

వివాదాలతో చిక్కులు ఇలా...

● జిల్లా కేంద్రంలోని ఇద్దరు మిత్రులు ఉమ్మడి పెట్టుబడితో ఓ వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారం బాగా జరుగుతూ ఆర్థికంగా బలపడిన సమయంలో ఇద్దరి మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. లెక్కల్ని తారుమారు చేసి చూపుతున్నాడనే అపనమ్మకం ఇద్దరిలోనూ బలపడి విడివిడిగా కోర్టులో కేసులు వేశారు. ఈ క్రమంలో ఎవరికి వారు కేసు గెలవాలని పంతానికి పోయారు. ఫలితం... బాగా జరుగుతున్న వ్యాపారం కాస్త మూతపడింది.

● జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులకు పక్కపక్కనే పొలాలు ఉన్నాయి. ఈ క్రమంలో పంటకు కాలువ నీరు పెట్టే విషయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఎవరికి వారు బంధుజనాన్ని పోగేసుకుని కిందామీద పడి కొట్టుకున్నారు. కొందరికి కాళ్లు, చేతులు విరిగాయి. దీంతో పోలీసు కేసు నమోదై, ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తోంది.

.... ఎవరికి వారు కేసు గెలవాలన్న పంతానికి పోవడంతో ఎన్నో రకాల వివాదాలు న్యాయస్థానాల్లో అపరిష్కృతంగానే ఉన్నాయి. ఫలితంగా ఆయా కేసులకు సంబంధించి కోర్టు ఖర్చులు, లాయరు ఫీజులు ఇతరత్రా అన్ని కలిపి కక్షిదారులపై భారం తడిసి మోపడవుతోంది. ఇలాంటి తరుణంలో జాతీయ లోక్‌అదాలత్‌ మధ్యేమార్గంగా తీర్పులు వెలువరిస్తుంది.

సమస్యను సామర్యసంగా అర్థం చేసుకుంటే ఎంత పెద్ద వివాదాన్నైనా సులువుగా పరిష్కరించుకోవచ్చునని జాతీయ లోక్‌ అదాలత్‌లు నిరూపించాయి. కక్షిదారులను ఏకం చేసి, ప్రశాంత జీవనం గడిపేలా చేయడమే జాతీయ లోక్‌అదాలత్‌ న్యాయవాదుల ముఖ్య ఉద్ధేశ్యం. అన్ని రకాల కోర్టులలో పెండింగ్‌లో ఉన్న మోటార్‌ వాహనాల ప్రమాద కేసులు, సివిల్‌ కేసులు, చెక్‌బౌన్స్‌ కేసులు, కుటుంబ తగాదాలు (విడాకుల కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగిన క్రిమినల్‌ కేసులు, ప్రిలిటిగేషన్‌ కేసులకు చక్కటి పరిష్కారాన్ని జాతీయ లోక్‌ అదాలత్‌లో న్యాయమూర్తులు చూపుతున్నారు. సాధారణ కోర్టులో వెలువడిన తీర్పు వెలువడితే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. అయితే జాతీయ లోక్‌అదాలత్‌ ఇచ్చిన తీర్పులు సుప్రీం కోర్టు తీర్పులతో సమానం... అదే అంతిమం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేసులను పరిష్కారం చేసుకోవాలనుకునే కక్షిదారులకు జాతీయ లోక్‌ అదాలత్‌ ఓ వరంగా మారింది.

సాధారణంగా కోర్టు వివాదాల్లో చిక్కుకున్న కక్షిదారులు ఇద్దరిలో అంతిమంగా ఒక్కరినే విజయం వరిస్తుంది. అయితే జాతీయ లోక్‌ అదాలత్‌ వెలువరించి తీర్పులో ఇద్దరూ విజేతలుగానే నిలుస్తున్నారు. సివిల్‌ కేసుల్లో జాతీయ లోక్‌అదాలత్‌లో పరిష్కారం దక్కితే అప్పటి వరకూ వారు చెల్లించిన కోర్టు ఫీజులు సైతం వెనక్కి చెల్లిస్తారు. బ్యాంకులో రుణం తీసుకుని కట్టకుండా ఏళ్ల తరబడి ఉన్న కేసులను సైతం ఒన్‌ టైం సెటిల్‌మెంట్‌ ద్వారా పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 13 ప్రాంతాల్లోని 26 బెంచుల్లో జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహణకు రంగం సిద్ధమైంది. అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని కోర్టుల్లోనూ డిసెంబర్‌ 14న జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నారు. ఒకే రోజు 5 వేల కేసులకు పరిష్కారం చూపే దిశగా న్యాయమూర్తులు కసరత్తు చేపట్టారు. అన్ని విభాగాల అధికారులనున సమన్వయం చేసుకుని లోక్‌అదాలత్‌ను విజయవంతం చేసేలా కృషి చేస్తున్నారు.

న్యాయ పరిష్కారంలో

వాది, ప్రతివాది ఇద్దరూ విజేతలే

సుప్రీం కోర్టు తీర్పుతో సమానంగా జాతీయ లోక్‌అదాలత్‌ సేవలు

డిసెంబర్‌ 14న జాతీయ లోక్‌ అదాలత్‌

ఇరువురూ విజేతలే..

‘సుప్రీం’ తీర్పుతో సమానం..

జాతీయ లోక్‌అదాలత్‌ మంచి వేదిక

న్యాయ పరిష్కారం కోరుకుంటున్న కక్షిదారులకు జాతీయ లోక్‌ అదాలత్‌ మంచి వేదిక. రాజీ చేయదగిన కేసులన్నింటినీ పరిష్కరించేందుకు ఇదొక మంచి అవకాశం. ఈ తీర్పులకు తిరుగు లేదు. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుంది. సివిల్‌ కేసుల్లో న్యాయపరిష్కారం పొందితే కోర్టు ఫీజులు సైతం వెనక్కి చెల్లిస్తాం. డిసెంబర్‌ 14న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో 26 బెంచ్‌లు ఏర్పాటు చేశాం. ఈ అంశంపై ఇప్పటికే ఆయా పరిధిలోని జడ్జిలతో సమీక్షించాం. గత లోక్‌అదాలత్‌లో ఏకంగా 6 వేల కేసులకు పరిష్కారం దక్కింది. తాజా మరో 5 వేల కేసులను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాం.

– జి. శ్రీనివాస్‌, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
ఈ తీర్పు ఫైనల్‌ 1
1/2

ఈ తీర్పు ఫైనల్‌

ఈ తీర్పు ఫైనల్‌ 2
2/2

ఈ తీర్పు ఫైనల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement