దొంగలను పట్టుకున్న రైతులు
బత్తలపల్లి: పంట పొలాల్లో రైతులు అమర్చుకున్న బిందు, తుంపర సేద్యం పరికరాలను అపహరించుకెళుతున్న ఇద్దరిని రైతులు బంధించి పోలీసులకు అప్పగించారు. వివరాలు... బత్తలపల్లిలోని జగనన్న లేఅవుట్ కాలనీ సమీపంలో ఓ రైతు గురువారం తన పొలానికి నీరు పెట్టి సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. కాసేపటి తర్వాత పొలానికి బయలుదేరిన ఆయన మార్గ మధ్యంలో కేబుల్ వైర్లను కాలుస్తున్న ముగ్గురు అపరిచితులను గుర్తించి వారి పక్కన చేరి మౌనంగా పరిశీలించాడు. ఆ చుట్టుపక్కల కత్తిరించి పడేసిన కేబుల్‌ను గమనించి ఆగంతకులు గమనించకుండా తన కుమారుడికి ఫోన్ చేసి విషయం తెలిపాడు. సమాచారం అందుకున్న గ్రామంలోని రైతులు మూకుమ్మడిగా అక్కడకు చేరుకుంటుండగా గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతులు వెంటాడి ఇద్దరిని పట్టుకున్నారు. మరొకడు తప్పించుకున్నాడు. పట్టుబడిన ఇద్దరికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో ఒకరు కంబదూరు నివాసి కాగా, మరొకరు వేంపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద గుడారాలు వేసుకుని పగలు వ్యాపారాలు చేసుకుంటూ, రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారణ అయింది. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
వృద్ధురాలిని కాపాడిన పోలీసులు
పుట్టపర్తి టౌన్: ఆత్యహత్యాయత్నం చేయబోయిన వృద్ధురాలిని పోలీసులు సకాలంలో గుర్తించి కాపాడారు. వివరాలు... రొద్దం మండలం పద్ద కోడిపల్లికి చెందిన బోయ గంగమ్మ కుటుంబకలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి పెంచుకుని రెండు రోజుల క్రితం ఇల్లు విడిచి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కొత్తచెరువు సమీపంలోని నాగులకనుమ వద్ద బుక్కపట్నం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైన ఆమెను స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కానిస్టేబుళ్లు భాస్కర్, మారుతి అక్కడకు చేరుకుని ఆమెను కాపాడి, పీఎస్‌కు పిలుచుకెళ్లారు. కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వృద్ధురాలిని జాగ్రత్తగా చూసుకోవాలని అప్పగించారు.
ప్రమాదంలో పలువురికి గాయాలు
బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... మండలంలోని గంటాపురం గ్రామానికి చెందిన నాగభూషణ శుక్రవారం బెంగుళూరు నుంచి విచ్చేసిన తన కుమార్తె తనుశ్రీని తీసుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. బత్తలపల్లి వద్ద నూతనంగా నిర్మించిన ఫ్‌లై ఓవర్ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వేగంగా ద్విచక్ర వాహనంపై దూసుకొచ్చిన ధర్మవరం మండలం నాగలూరు గ్రామానికి చెందిన సోము ఢీకొన్నాడు. ప్రమాదంలో త్రీవంగా గాయపడిన ముగ్గురునీ స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.
పోకిరీ వేధింపులపై
ఎంఈఓ విచారణ
ధర్మవరం అర్బన్: స్థానిక ఇందిరమ్మ కాలనీలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉదయం ఓ పోకిరీ చొరబడి ఇద్దరు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఘటనపై శుక్రవారం ఉదయం ఆ పాఠశాలకు ఎంఈఓ గోపాల్‌నాయక్ చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో ఆయన సమావేశమై మాట్లాడారు. పాఠశాల ప్రహరీకున్న రెండు గేట్లలో ఓ గేటును మూసివేయాలని నిర్ణయించారు. పాఠశాలలో ఆకతాయిలు చొరబడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎంఈఓను సీఐటీయూ నాయకులు కలసి వినతి పత్రం అందజేశారు.
అంతర్ కళాశాలల పురుషుల క్రీడాపోటీలు ప్రారంభం
గుంతకల్లు: స్థానిక శంకరనందాగిరి స్వామి డిగ్రీ కళాశాలలో శుక్రవారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల అంతర్ కళాశాలల పురుషుల క్రీడాపోటీలు అట్టహసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ రమేష్‌బాబు, స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ బి.జెస్సీ, కళాశాల కరస్పాండెంట్ కేసీ హరి, కళాశాల చైర్మన్ మురళి, తదితరులు హాజరయ్యారు. విద్యార్థుల్లో పోటీ తత్త్వంతో పాటు స్నేహభావాన్ని పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. చదువులతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వ్యాయామ ఉపాధ్యాయుడు బాషా తదితరులు పాల్గొన్నారు. కాగా, కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్ తదితర విభాగాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని కళాశాలల క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment