దాడి కేసులో నిందితుడి అరెస్ట్
కదిరి టౌన్: వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ కదిరిలోని అయ్యప్ప స్వామి గుడి వెనుక వీధిలో నివాసముంటున్న బాల మురళీకృష్ణ టపాసులు కాలుస్తుండగా అదే ప్రాంతానికి చెందిన హరిప్రసాద్ వారించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. క్షణికావేశానికి లోనైన బాలమురళీకృష్ణ చేతికి అందిన ఇటుక పెళ్లతో హరిప్రసాద్‌పై దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హరిప్రసాద్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఉదయం బాలమురళీకృష్ణను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
శారదానగర్‌లో
పర్యటించిన వైద్యాధికారి
ధర్మవరం అర్బన్: స్థానిక శారదానగర్‌లో డెంగీ కేసు నమోదు కావడంతో జిల్లా సహాయ మలేరియా అధికారి లక్ష్మీనాయక్ శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటించి విచారణ చేశారు. శారదానగర్‌కు చెందిన 9 ఏళ్ల వయసున్న జితేంద్ర డెంగీ బారిన పడ్డాడు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో పర్యటించిన వైద్యాధికారులు వార్డులోని కాలువలను శుభ్రం చేయించారు. ప్రతి ఇంటా జ్వర పరీక్షలు చేపట్టారు. అనంతరం కీటక జనిత వ్యాధులపై స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారులు జయరాంనాయక్, గోపీనాయక్, వెంకటేష్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
చోరీ కేసులో నలుగురి అరెస్ట్
కదిరి టౌన్: స్థానిక అడపాల వీధిలో నివాసముంటున్న వి.నారాయణస్వామి ఇంట్లో చోరీకి పాల్పడిన నలుగురుని అరెస్ట్ చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను పట్టణ పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. నారాయణస్వామి ఇంటి పైపోర్షన్‌ను ఇటీవల ఇద్దరు అద్దెకు తీసుకున్నారు. గత నెల 18న ఇంట్లో ఎవరూ లేని సమయంలో సదరు వ్యక్తులు లోపలకు చొరబడి రూ.3.50 లక్షల నగదు అపహరించుకెళ్లారు. ఘటనపై అదే రోజు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సాయంత్రం హిందూపురానికి వెళ్లే మార్గంలో ఉన్న గట్లు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న కర్ణాటకకు చెందిన సన్మాన్‌ఖాన్, మక్సూద్‌అహమ్మద్, ఎస్.ఫరూక్ అబ్ధుల్లా, తోకల శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో నారాయణస్వామి ఇంట్లో చోరీ చేసినట్లుగా అంగీకరించారు. నిందితుల నుంచి రూ.2.20 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment