పురం చైర్మన్ ఎన్నికకు నేడు నోటిఫికేషన్?
● ఇప్పటికే హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో కౌన్సిలర్లు
● గోడదూకిన కౌన్సిలర్లకు సకల మర్వాదలు చేస్తున్న టీడీపీ నేతలు
● శనివారం బాలకృష్ణతో సమావేశం...
వెనువెంటనే నోటిఫికేషన్‌కు చర్యలు
● సోమవారం చైర్మన్ ఎన్నిక నిర్వహించేలా ప్రణాళిక
హిందూపురం: పార్టీ ఫిరాయింపులు... క్యాంపు రాజకీయాలతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హిందూపురం మునిసిపల్ చైర్మన్ ఎన్నిక చివరి అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 11న మునిసిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేలా శనివారమే నోటిఫికేషన్ జారీకి టీడీపీ నాయకులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.
చైర్మన్ గిరి కోసం రిసార్ట్ రాజకీయం..
38 వార్డులున్న హిందూపురం మునిసిపాలిటీలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆరుగురు, బీజేపీ తరఫున ఒకరు, ఎంఐఎం తరఫున ఒక కౌన్సిలర్ ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలోనే మకాం వేసి వార్డులన్నీ తిరిగినా జనం పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ ఏకంగా 30 స్థానాల్లో అఖండ విజయం సాధించింది. అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం మునిపల్ చైర్మన్ పీఠంపై కన్నేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి టీడీపీవైపు తిప్పుకున్నారు. లొంగని వారిని బెదించారు. మొత్తానికి పలువురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు బలవంతంగా పచ్చకండువాలు కప్పి వారందరినీ కుటుంబాలతో సహా మూడు రోజుల క్రితం హైదరాబాద్‌కు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. అక్కడ వారు చేజారిపోకుండా వారి సెల్‌ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని రాచమర్యాదలు చేస్తున్నారు.
నేడు బాలకృష్ణతో భేటీ..
హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఉన్న కౌన్సిలర్లు శుక్రవారం ఓల్ట్ సిటీలో షాపింగ్ చేశారు. పలువురు ముస్లిం కౌన్సిలర్లు చార్మినార్ సమీపంలోని మసీద్‌లో ప్రార్థనలు చేశారు. వీరంతా శనివారం ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే బాలకృష్ణ ఓకే అంటే శనివారమే నోటిఫికేషన్ ఇచ్చి సోమవారం చైర్మన్ ఎన్నిక నిర్వహించేలా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని రిసార్ట్‌లో ఉన్న కౌన్సిలర్లంతా నేరుగా చైర్మన్ ఎన్నిక రోజు కౌన్సిల్‌కు చేరుకునేలా రంగం సిద్ధం చేశారు. ఆరుగురు కౌన్సిలర్లున్న టీడీపీ.... చైర్మన్ పీఠం కోసం చేస్తున్న అప్రజాస్వామ్య చర్యలపై హిందూపురం వాసులు పెదవి విరుస్తున్నారు. కొన్ని వార్డుల్లోని వారైతే పార్టీ ఫిరాయింపుదారులకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment