బావిలో దిగి రైతు కూలీ మృతి
ధర్మవరం రూరల్: మోటారు మరమ్మతు కోసం బావిలో దిగిన ఓ రైతు కూలీ నీట ఊపిరి ఆడక మృతి చెందాడు. మృతదేహం కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. వివరాలు.... ధర్మవరం మండలం కట్టకిందపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలోని వ్యవసాయ బావిలో మోటారు మరమ్మతుకు గురైంది. మోటారును వెలికి తీసేందుకు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన దాసరి రామాంజినేయులు (43)తో పాటు మరో వ్యక్తి వెళ్లారు. పుష్కలంగా నీళ్లు ఉన్న బావి అడుగున ఉన్న మోటార్‌కు తాడు కట్టి పైకి లాగాలని భావించారు. ఈ క్రమంలో రామాంజనేయులు బావిలో దిగి నీటిలో ఉన్న మోటార్ వద్దకు ఈదుకుంటూ వెళ్లాడు. అయితే బావిలో ముళ్ల పొదల్లో చిక్కుకున్న ఆయన బయటకు రాలేక ఊపిరాడక బావిలోనే మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో నీటిని తోడే ప్రయత్నం చేపట్టారు. బావి ఉపరితలంలో ఉన్న చెరువు నుంచి నీరు ఊరుతుండడంతో నీరు ఎంతకూ తగ్గడం లేదు. సాయంత్రం వరకూ ఫైర్ ఇంజన్ సాయంతో నీటిని తోడినా మృతుడి ఆచూకీ లభ్యం కాలేదు. విషయం తెలుసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆర్డీఓ మహేష్, బీజేపీ నాయకులు అక్కడకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment