జీఓ 143ని తక్షణమే రద్దు చేయాలి
ఉరవకొండ: వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు నరకప్రాయమైన జీఓ 143ని తక్షణమే రద్దు చేయాలని కూటమి సర్కార్‌ను మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కోదండరామిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 50 మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి జిల్లా కేంద్రంలోనే తిష్ట వేసుకున్నారని, అలాంటి వారిని గుర్తించి గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయాలని కోరారు. శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వివిధ హోదాల్లోని ఉద్యోగుల్లో చాలా మంది వివిధ కారణాలతో మృతి చెందారని, దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలు అందించిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం కేవలం రూ.2 లక్షలు చెల్లించి చేతులు దులుపుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ యజమాని చనిపోయిన తర్వాత ఆ కుటుంబం రోడ్డున పడుతుందనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు విస్మరించడం బాధాకరమన్నారు. మృతి చెందిన ఉద్యోగి కుటుంబసభ్యులకు రూ.20 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కోదండరామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment