ఎంబీసీకి మంగళం!
మడకశిర: హంద్రీనీవా మడకశిర బైపాస్ కెనాల్ నిర్మాణాన్ని కూటమి సర్కార్ అటకెక్కించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కూటమి సర్కార్ తీసుకుంటున్న ఈ నిర్ణయం మడకశిర నియోజకవర్గంలోని రైతులకు శాపంగా మారనుంది. వ్యవసాయ భూములన్నీ బీడుగా మారే పరిస్థితి ఏర్పడనుంది. గత ప్రభుత్వంలో ఎంతో కష్టపడి సాధించుకున్న ఈ బైపాస్ కెనాల్ నిర్మాణాన్ని కూటమి సర్కార్ మంగళం పాడటం అన్యాయమని రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
120 కిలో మీటర్లు దాటి...
మడకశిర నియోజకవర్గంలో వందలాది చెరువులు ఉన్నాయి. ఈ చెరువులకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అందడం లేదు. ప్రస్తుతం మడకశిర ప్రాంతానికి కృష్ణా జలాలు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి చుట్టేసుకుని రావాలి. దాదాపు 120 కిలోమీటర్లు చుట్టేసుకుని మడకశిర నియోజకవర్గానికి కృష్ణా జలాలు చేరాలంటే చాలా కష్టం. ప్రస్తుతం గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం, పరిగి మీదుగా కృష్ణా జలాలు మడకశిర నియోజకవర్గంలోకి ప్రవేశిస్తాయి. ఇలా చుట్టేసుకుని మడకశిరకు కృష్ణా జలాలు చేరడానికి దాదాపు 10 రోజులు పడుతుంది. ప్రతి ఏడాది మడకశిర ప్రాంతానికి 15 రోజులకన్నా కృష్ణా జలాలను విడుదల చేసే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితిలో కృష్ణా జలాలు మడకశిర నియోజకవర్గంలోకి ప్రవేశించడానికే 10 రోజులు అవుతుంది. మిగిలిన 5 రోజుల్లో రెండు లేదా మూడు చెరువులను నింపడానికే కష్టతరంగా మారుతోంది.
బైపాస్ కెనాల్ నిర్మిస్తే 33 కిలో మీటర్లే..
మడకశిర నియోజకవర్గానికి ఆలస్యం జరగకుండా కృష్ణా జలాలను అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్నప్పుడు బైపాస్ కెనాల్‌ను రూపొందించారు. కెనాల్ పూర్తయితే నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలు అందించడానికి అవకాశం ఏర్పడేది. మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాలకు పూర్తిస్థాయిలో కృష్ణా జలాలు పారుతాయి. పెనుకొండ నుంచి నేరుగా మడకశిరకు కృష్ణా జలాలను తీసుకెళ్లడానికి వీలుగా గత ప్రభుత్వం బైపాస్ కెనాల్ నిర్మించడానికి నిర్ణయం తీసుకుంది. కేవలం 33 కిలోమీటర్ల పొడువుతో బైపాస్ కెనాల్ నిర్మాణంతో మడకశిరకు కృష్ణా జలాలు చేరుతాయి. అంటే 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన వెంటనే రెండు రోజుల్లోనే మడకశిర ప్రాంతానికి కృష్ణాజలాలు చేరే విధంగా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
రూ.214.85 కోట్లు మంజూరు చేసిన జగన్
బైపాస్ కెనాల్ నిర్మాణ అంశాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కేబినెట్‌లో పెట్టి ఆమోదించారు. డీపీఆర్‌ను కూడా ప్రభుత్వం ఆమోదించింది. వెంటనే రూ.214.85 కోట్లు నిధులను కూడా మంజూరు చేసింది. న్యాయ సమీక్షలో కూడా కెనాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. టెండర్లను కూడా పూర్తి చేశారు. పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఎన్నికలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం పనులు ప్రారంభించడానికి ఎలాంటి ఆటంకాలు కూడా లేవు. అయితే కూటమి సర్కార్ బైపాస్ కెనాల్ నిర్మాణానికి స్వస్తి పలికినట్లు ప్రచారం జరుగుతుండడంతో రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
కాలువ స్థాయి పెంచేందుకు యత్నం?..
బైపాస్ కెనాల్ నిర్మిస్తే వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో కూటమి ప్రభుత్వం బైపాస్ కెనాల్‌కు స్వస్తి పలుకుతున్నట్లు తెలుస్తోంది. దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం మడకశిరకు కృష్ణా జలాలను తీసుకువస్తున్న హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మడకశిర బ్రాంచ్ కెనాల్ స్థాయిని పెంచినా కృష్ణా జలాలు 120 కిలోమీటర్లు చుట్టేసుకుని మడకశిరకు చేరాల్సిందేనని రైతులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ హయాంలో మడకశిర బైపాస్ కెనాల్ నిర్మాణానికి రూ.214.85 కోట్లు మంజూరు
టెండర్లు కూడా పూర్తి
ఎంబీసీ పనులను అటకెక్కించిన కూటమి సర్కార్ !
హంద్రీనీవా కాలువ స్థాయిని
పెంచేందుకు యత్నం
గత ప్రభుత్వానికి మంచి పేరు
వస్తుందనే రైతులకు అన్యాయం
జిల్లాలో పూర్తిగా వెనుకబడిన మడకశిర నియోజకవర్గంలో అన్ని చెరువులకూ
కృష్ణా జలాలు అందించి రైతులను ఆదుకోవడానికి వీలుగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో హంద్రీనీవా మడకశిర బైపాస్ కెనాల్ నిర్మించేలా చర్యలు
చేపట్టింది. రూ.214.85 కోట్లు మంజూరు చేసి టెండర్లను కూడా పూర్తి చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎంబీసీకి మంగళం పాడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని విస్మరించి ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment