అన్నీ కుట్రలే..
ధర్మవరం: ప్రజాదరణలో ముందుండే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. చెరువును ఆక్రమించారంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి నోటీసులిప్పించింది. నిజాలు తెలుసుకోకుండా ఎల్లో మీడియా కథనాలను వండివార్చింది. హైకోర్టు ఆ నోటీసులను రద్దు చేసినా ఈనాడు దినపత్రిక రాసిన రోత రాతలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
ఎన్నికలకు ముందు నుంచే కుట్ర..
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండల పరిధిలోని తుంపర్తి పొలంలో తన తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో సర్వే నంబర్ 904, 905, 908 లలో 25.38 ఎకరాల పొలాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈ పొలంలో చీనీ, వక్క తదితర పంటలను సాగు చేస్తున్నారు. ఎన్నికలకు ముందే కూటమి నాయకులు కేతిరెడ్డికి చెడ్డపేరు తెచ్చేలాగా చేయాలని కుట్ర పన్నారు. అనుకున్నదే తడువుగా చెరువుకు సమీపంలో ఉన్న కేతిరెడ్డి కుటుంబీకులకు చెందిన ఫాంహౌస్‌పై అసత్య ఆరోపణలు చేశారు. చెరువు స్థలం కబ్జా చేశారని ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేశారు. వాస్తవంగా అయితే 1932కు ముందే పట్టాలు పొందిన ఒరిజినల్ రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములు ఇవి. అయినా నిజాలు తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా ప్రచారం చేశారు.
అధికారులపై ఒత్తిడి..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయకులు కేతిరెడ్డికి చెందిన ఫాంహౌస్ చెరువు ఆక్రమణలో ఉందని, నోటీసులు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సైతం ఎక్కడా కూడా ఆక్రమణలు లేవని, రికార్డులు ఉన్నాయని ఎంత చెప్పినా కూటమి నాయకులు వినలేదు. దీంతో చేసిది లేక ఇరిగేషన్ అధికారులు నోటీసులిచ్చారు.
నోటీసులు రద్దు చేసిన హైకోర్టు..
కూటమి నాయకులు చేస్తున్న కుట్రలను ఎండగట్టాలని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన కుటుంబ సభ్యుల ద్వారా 20 రోజుల క్రితం డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ సూట్‌ను వేశారు. ఫాంహౌస్‌కు భూముల ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఆధారాలను స్వీకరించిన న్యాయస్థానం కోర్టు కమిషనర్‌ను నియమించి విచారణ చేపట్టింది. సూట్ ప్రకారం కోర్టుకు సమాచారం ఇవ్వకుండా నిబంధనలు అతిక్రమించకుండా అధికారులు చట్టానికి లోబడి ఉండాల్సి ఉంటుంది. అయితే ఇవేవి పట్టించుకోకుండా ఇరిగేషన్ అధికారులు కేతిరెడ్డి మరదలు గాలి వసుమతి పేరిట చెరువు స్థలం ఆక్రమించారని ఆరోపిస్తూ ఈనెల 6న నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోపు ఫాంహౌస్ ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు. నోటీసులిచ్చిన రోజునే కేతిరెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆధారాలను సమర్పించినా ఇరిగేషన్ అధికారులు ఏ విధంగా నిబంధనలు అతిక్రమించి కోర్టుకు తెలుపకుండా నోటీసులు ఇచ్చారో నివేదించారు. విచారించిన న్యాయస్థానం ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులను ఈనెల 7వ తేదీనే రద్దు చేస్తూ (సెట్ అసైడ్) ఉత్తర్వులను ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసు పూర్తిగా రద్దయింది.
పక్కరైతు భూమిని కూడా...
కేతిరెడ్డి కుటుంబ సభ్యుల ఫాంహౌస్‌కు ఆనుకుని సర్వే నంబర్ 43–2, 43–2ఎ, 43–2బీలో ఉన్న భూమిని కేతిరెడ్డికే ఆపాదించారు. సదరు భూమికి సంబంధించిన యజమాని అయిన రైతు జే.సూర్యనారాయణ 2018లో టీడీపీ హయాంలో ఇచ్చిన జీఓ నంబర్ 575 ప్రకారం డాటెడ్ ల్యాండ్ నుంచి ఎన్‌ఓసీ తెచ్చుకుని అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి ఆమోదంతో రెగ్యులరైజ్ చేసుకున్నారు. దీన్ని కూడా ఆక్రమణ అంటూ అధికారులు కేతిరెడ్డికి అంటగట్టే ప్రయత్నం చేసి నోటీసులిచ్చి రైతును కూడా ఇబ్బంది పెడుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డే టార్గెట్
ఎల్లో మీడియాతో జతకట్టి
అధికారులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడి
చెరువు ఆక్రమించారంటూ
నోటీసులిచ్చిన అధికారులు
నోటీసులు రద్దు చేసిన హైకోర్టు
అయినా ‘ఈనాడు’లో
తప్పుడు కథనాలు
శిక్ష పడేలా చేస్తా
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వ పెద్దలు అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఎలాగైనా నాపై బురదజల్లి రాక్షసానందం పొందాలని చూస్తున్నారు. అయితే చట్ట పరిధిలోనే వారికి శిక్ష పడేలాగా చేస్తా. తుంపర్తి వద్ద నా కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఫాంహౌస్‌లో చెరువు స్థలం ఒక్క సెంటు కూడా ఆక్రమణకు గురి కాలేదు. గతంలోనే అధికారులు విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోకుండా నోటీస్‌లు ఇస్తున్నారు. నా ఫాంహౌస్ పేరిట ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీస్‌ను హైకోర్టు రద్దు చేసినా ఎల్లో మీడియా అసత్య కథనాలతో బురదజల్లాలని చూస్తోంది. నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై కోర్టులో శిక్షపడేలాగా చేస్తా.
– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం
Comments
Please login to add a commentAdd a comment