రైతులను ఆదుకోవాల్సిందే
అనంతపురం సిటీ: వరుస తుపానుల కారణంగా కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని, నష్టాల్లో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాపరిషత్‌లో చైర్‌పర్సన్ సమక్షంలో స్థాయీ సంఘం–3 (వ్యవసాయం) సమావేశం గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు అధ్యక్షతన జరిగింది. వ్యవసాయ శాఖపై చర్చను ప్రారంభించిన గిరిజమ్మ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లోనూ ఖరీఫ్ పంటలు దెబ్బతింటే ప్రభుత్వం 14 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించడం అన్యాయమన్నారు. ఉమ్మడి జిల్లా అంతటినీ కరువు జాబితాలో చేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అధికారులకు సూచించారు. నిబంధనలను పక్కనపెట్టి రైతులను ఆదుకోవాలని గుమ్మఘట్ట జెడ్పీటీసీ మహేశ్, నల్లమాడ జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
ఉన్నతాధికారుల గైర్హాజరుపై ఆగ్రహం..
స్థాయీ సంఘ సమావేశాలకు, జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు కిందిస్థాయి సిబ్బందిని పంపి గైర్హాజరవుతున్న శ్రీసత్యసాయి జిల్లా అధికారులపై సభ్యులు డాక్టర్ గోరంట్ల బాషా, జయరాం నాయక్, శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ డుమ్మా కొడుతున్న అధికారులపై చర్యలు తీసుకోకపోతే సమావేశాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. జెడ్పీ చైర్‌పర్సన్ స్పందిస్తూ గైర్హాజరయ్యే అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఈఓ వెంకటసుబ్బయ్యకు సూచించారు. సోమందేపల్లి హైస్కూల్‌లో టపాసుల అంగళ్ల నిర్వహణకు ఎలా అనుమతి ఇచ్చారని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ డీఈఓ కిష్టప్పను ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.80 కోట్లు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటం ప్రభుత్వానికి మంచిది కాదని పేర్కొన్నారు.
టమాట మార్కెట్‌లో ఏమిటీ దోపిడీ?
అనంతపురం శివారులోని కక్కలపల్లి వద్ద టమాట మార్కెట్‌కు వచ్చి వెళ్లే వాహనాల నుంచి లారీ అసోసియేషన్ పేరిట వాహనాన్ని బట్టి రూ.500 నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్ ఆరోపించారు. అయితే ఈ డబ్బు పంచాయతీకి గానీ, కార్పొరేషన్‌కు గానీ, మరే ఇతర ప్రభుత్వ శాఖకు పన్ను రూపంలో జమ చేయకుండా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. జెడ్పీ చైర్‌పర్సన్ కల్పించుకుని మార్కెటింగ్, డీపీఓ, పోలీస్ శాఖలు సమన్వయంతో దోపిడీ సంగతి తేల్చాలని, అవసరమైతే లారీ అసోసియేషన్ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ప్రభుత్వాదాయాన్ని కాపాడాలని సూచించారు. హిందూపురం మార్కెట్ యార్డులోనూ ఇష్టారాజ్యంగా బ్రోకర్లు ధరలు నిర్ణయించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని లేపాక్షి జెడ్పీటీసీ శ్రీను ఆరోపించారు.
అంగన్‌వాడీలు ప్రైవేటు ఉద్యోగం చేయొచ్చా?
అనంతపురం అర్బన్ పరిధిలో కొందరు అంగన్‌వాడీ వర్కర్లు తమ విధులకు డుమ్మా కొట్టి ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించాలని జెడ్పీటీసీ సభ్యుడు చంద్ర డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఓ అంగన్‌వాడీ వర్కర్ ఒకరు తన భర్త జిల్లా ముఖ్య అధికారి వద్ద సీసీగా పని చేస్తుండడాన్ని అడ్డుపెట్టుకొని పదేళ్లుగా అంగన్‌వాడీ సెంటర్‌కే వెళ్లడం లేదని ఆరోపించారు. మరికొందరు సీనియర్ అంగన్‌వాడీలు వయసు మీరినా తప్పుడు ధ్రువీకరణతో సర్వీసులోనే కొనసాగుతున్నారని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఐసీడీఎస్ పీడీ డాక్టర్ శ్రీదేవి స్పందిస్తూ.. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
‘ఉపాధి’ 150 రోజులకు పెంచాలి..
ఉపాధి హామీ పథకం ఎంతో మంది ఆకలి తీరుస్తోందని, వంద రోజుల పనిదినాల సంఖ్యను 150కు పెంచాలని జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ అధికారులను కోరారు. రోజు కూలి రూ.500కు పెంచాలని డిమాండ్ చేశారు. ఇతర స్థాయీ సంఘ సమావేశాలకు సంబంధించి ఆయా శాఖాధిపతులు తమ శాఖల ప్రగతిని చదివి వినిపించారు. వాటిపై సభ్యులు అనేక అంశాలలను లేవనెత్తి, చర్చించారు.
63 మండలాలనూ
‘కరువు’ జాబితాలో చేర్చాలి
స్థాయీసంఘ సమావేశంలో
జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ
Comments
Please login to add a commentAdd a comment