క్వింటా ఎండుమిర్చి రూ.14 వేలు
హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో క్వింటా ఎండుమిర్చి గరిష్టంగా రూ.14 వేలు పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 332 మంది రైతులు 485.50 క్వింటాళ్ల ఎండుమిర్చి తీసుకొచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. మొదటిరకం ఎండుమిర్చి క్వింటా రూ.14 వేలు, రెండో రకం క్వింటా రూ.9 వేలు, మూడో రకం ఎండుమిర్చి క్వింటా రూ.7 వేల ప్రకారం పలికింది.
పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు సద్వినియోగం చేసుకోండి
హిందూపురం: తపాలాశాఖ ప్రవేశపెట్టిన ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)లో సేవలు సద్వినియోగం చేసుకోవాలని హిందూపురం డివిజన్ పోస్టల్ సూపరిటెండెంట్ యు.విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సేవలను వివరించారు. జాతీయ, ప్రాంతీయ బ్యాంకులతో సమానంగా ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంకులలో అర్హులైన వారికి ఆర్థిక సాధికారత, ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందే అవకాశాలుంటాయన్నారు. జిల్లాలోని 472 పోస్టాఫీసుల్లో బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఆసక్తి ఉన్న వారు ఆయా పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆధార్ లింకేజ్ సులభతరం చేయడానికి ఈ నెల 15 నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని సచివాలయ పరిధిల్లో తపాలా శాఖ ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
చోళమాంబదేవికి పూజలు
అమరాపురం: స్థానిక కోట వీధిలో వెలసిన గ్రామదేవత చోళమాంబదేవికి భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి దీపాలంకరణ, కుంకుమార్చన, వివిధ రకాల అభిషేకాలను చేపట్టారు. అనంతరం భక్తులు తెచ్చిన వివిధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. భక్తులకు ప్రసాద వినియోగం చేశారు.
టమాటకు బీమా
ప్రీమియం చెల్లించండి
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రబీలో టమాట పంట సాగు చేసిన రైతులు బీమా పరిధిలోకి రావాలంటే తమ వాటా కింద ప్రీమియం చెల్లించాలని ఉద్యానశాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రబీలో ఉద్యాన పంటలకు సంబంధించి వాతావరణ బీమా కింద టమాటను నోటిఫై చేశారన్నారు. టమాట సాగు చేసిన రైతులు ఈ–క్రాప్ నమోదుతో పాటు ఎకరాకు రూ.1,600 ప్రకారం డిసెంబర్ 15 లోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కామన్ సర్వీసు సెంటర్ (సీఎస్‌సీ), ఆర్‌ఎస్‌కేల్లో సంప్రదించి 1–బీ, ఆధార్, బ్యాంకు అకౌంట్, పంట ధ్రువీకరణ పత్రాలు అందించి ప్రీమియం చెల్లించాలన్నారు. ఎకరాకు రూ.32 వేల ప్రకారం బీమా వర్తిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు ఉద్యానశాఖ అధికారులు లేదా బీమా పథకం అమలు చేసే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ జిల్లా మేనేజర్ కేవీ కృష్ణసాగర్ (9912275799)ను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment