త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్
ధర్మవరం అర్బన్: రీఓపెన్ గ్రీవెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలోని సమావేశ భవనంలో శుక్రవారం రెవెన్యూ అంశాలు, సాగునీటి సంఘాల ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ, కోర్టు కేసులు, ఈ ఆఫీస్, గ్రామసభలు తదితర అంశాలపై పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులు సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను రిజిస్టర్‌లో నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో 46 సాగునీటి సంఘాలకు సంబంధించి ఓటర్లు జాబితా తయారీ, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, ప్రచురణ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్‌మెంట్ భూముల్లో రీ వెరిఫికేషన్‌ను జిల్లా యంత్రాంగం నిర్ధేశించిన సమయంలోనే పూర్తి చేయాలన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలకు సంబంధించిన సమస్యలు, ఎస్సీ, ఎస్టీ హత్యా నిరోధక చట్టం 1989 మేరకు అందజేసే నష్ట పరిహారాన్ని సకాలంలో అందజేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓ మహేష్, తహసీల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష వాయిదా
కదిరి అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 10న జరగాల్సిన డీఎస్సీ ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఈమేరకు సహాయ సాంఘిక సంక్షేమాధికారి రెడ్డి బాలాజీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment