రెండు కోర్టులను యథాతథంగా ఉంచాలి
అనంతపురం: సీఐడీ కోర్టును కర్నూలులోని ఏసీబీ కోర్టుకు, గంజాయి, తదితర మాదక ద్రవ్యాల కేసుల విచారణను జిల్లా అదనపు కోర్టు నుంచి ప్రత్యేక కోర్టులకు బదలాయించడంతో పాటు, తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడంపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన జీఓలను రద్దు చేయాలంటూ అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం ఆరో రోజుకు చేరుకుంది. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న న్యాయవాదులకు సీపీఐ నేత నారాయణస్వామి, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి కాసాని నాగరాజు, అంకె కుళ్లాయప్ప, ఆర్గనైజింగ్ సెక్రెటరీ హరిప్రసాద్, జిలాన్‌బాషా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. .ఎన్‌డీపీఎస్ కోర్టును అనంతపురం నుంచి తిరుపతికి తరలించి పట్టుమని పది రోజులైనా గడవక ముందే సీఐడీ కోర్టును కర్నూలుకు తరలించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. దీంతో న్యాయవాదులకు, కక్షిదారులకు, అందరికీ ఇబ్బందులేనని పేర్కొన్నారు. ఇది వరకు అనంతపురం అదనపు జిల్లా జడ్జి పర్యవేక్షణలో ఉన్న ఎన్‌డీపీఎస్ కోర్టును తిరుపతికి తరలించడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకూ పోరాటం చేస్తున్న న్యాయవాదులకు సంపూర్ణ మద్దతునిస్తామన్నారు. సీనియర్ న్యాయవాది హనుమన్న మాట్లాడుతూ.. రెండు కోర్టులను తరలించడం వల్ల కేసుల విచారణలో ఎక్కువ జాప్యం చోటుచేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్షలో సీనియర్ న్యాయవాదులు సి. హనుమన్న, నార్పల శ్రీధర్, వి.కేశఽవయ్య, ఇతర న్యాయవాదులు దీక్షలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment