నేరాలు తగ్గాయి | - | Sakshi
Sakshi News home page

నేరాలు తగ్గాయి

Published Tue, Dec 31 2024 1:27 AM | Last Updated on Wed, Jan 1 2025 1:32 AM

నేరాలు తగ్గాయి

నేరాలు తగ్గాయి

పుట్టపర్తి టౌన్‌: క్షేత్రస్థాయిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడంతో ఈ ఏడాది జిల్లాలో ప్రధాన నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ రత్న తెలిపారు. సోమవారం ఆమె జిల్లా పోలీస్‌ కార్యాలయంలో వార్షిక నేర నివేదికను మీడియాకు విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పోలీసుల పనితీరు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, పీడీ చట్టం ప్రయోగం, పల్లె నిద్ర వంటి చర్యలతో గత ఏడాదితో పోలిస్తే 31.9 శాతం నేరాలు తగ్గాయన్నారు.

నూతన పోలీసింగ్‌కు శ్రీకారం..

రానున్న కొత్త ఏడాది జిల్లాను నేర రహితంగా తీర్చి దిద్దేందుకు నూతన పోలీసింగ్‌ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామని ఎస్పీ రత్న తెలిపారు. రాబోవు రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అందిపుచ్చుకొని నేర నియంత్రణకు చర్యలు చేపడతామన్నారు. పబ్లిక్‌, ప్రై వేట్‌ భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీలు విజయకుమార్‌, శివన్నారాయణస్వామి, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ ప్రదీప్‌, లీగల్‌ అడ్వయిజర్‌ సాయినాథరెడ్డి పాల్గొన్నారు.

వార్షిక నివేదికలోని ప్రధానాంశాలు ఇలా..

● ఈ ఏడాది వివిధ నేరాలకు సంబంధించి 627 కేసులు నమోదు, 2,752 మంది నిందితుల అరెస్టు. రూ.98,96,933 నగదు స్వాధీనం.

● 13 గంజాయి కేసుల్లో 36 మంది నిందితుల అరెస్టు. 24.1 కిలోల గంజాయి స్వాధీనం.

● 107 ప్రాపర్టీ కేసులు నమోదు. పదే పదే నేరాలకు పాల్పడుతున్న నలుగురిపై పీడీ యాక్ట్‌ ప్రయోగం. 126 మందిపై రౌడీ షీట్లు.

● 475 అక్రమ మద్యం కేసులు నమోదు. 579 మందిపై కేసులు. 8,894.97 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం.

● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ఈ సంవత్సరం 102 కేసులు నమోదు.

● గత ఏడాది జిల్లాలో 39 హత్యలు జరగ్గా, ఈఏడాది 29 నమోదయ్యాయి.

● చీటింగ్‌ కేసులు గతే ఏడాది 271 నమోదు కాగా, ఈఏడాది 182 కేసులు నమోదయ్యాయి.

● ఈ ఏడాది 39 సైబర్‌ కేసులు నమోదు. రూ.3,46,97,202 సొమ్ము గల్లంతు.

● గత ఏడాది మిస్సింగ్‌ కేసులు 546, ఈఏడాది 531 కేసులు నమోదయ్యాయి.

● విచారణలో ఉన్న 32 కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడ్డాయి. లోక్‌ అదాలత్‌లో 3,119 కేసులు పరిష్కారమయ్యాయి.

● 580 మొబైల్‌ ఫోన్లు రికవరీ. ఈఏడాది డయల్‌ 100లో 10,491 కాల్స్‌ రాగా, 10 నిమిషాలలో బాధితులకు సాయం అందింది.

ఈ ఏడాది త్వరగా ఛేదించిన కేసులు ఇలా..

● మడకశిర రూరల్‌ మండలం గుడిబండ పోలీస్టేషన్‌లో పరిధిలో 26 ఏళ్ల క్రితం జరిగిన బాలుడి హత్య కేసు, చిలమత్తూరు పోలీస్టేషన్‌ పరిధిలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ కేసు, హిందూపురం రూరల్‌ పోలీస్టేషన్‌లో బాలికపై అత్యాచారం, హత్య కేసు, మడకశిర సమీపంలో బాలుడు కిడ్నాప్‌, హత్య కేసును పోలీసులు గంటల్లోనే ఛేదించారు.

గత ఏడాదితో అన్ని రకాల నేరాలు

31.9 శాతం తగ్గాయి

సైబర్‌ నేరాలు మాత్రం పెరిగాయి

2024 వార్షిక నేర నివేదిక

వెల్లడించిన ఎస్పీ రత్న

పెండింగ్‌ కేసులపై దృష్టి సారించండి

పెండింగ్‌ కేసులను త్వరగతిన పరిష్కరించి బాఽధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్న పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్‌ హాలులో డీఎస్పీలు, సీఐలతో ఆమె డిసెంబర్‌ నెలకు సంబంధించిన నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పోలీస్టేషన్లలో నమోదైన కేసులు వివరాలు తెలుసుకొని నేరాలు, శిక్షలు, కోర్టు కేసుల పురోగతిపై పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం వివిధ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరచిన పోలీస్‌ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఎస్పీ రత్న మాట్లాడారు. కేసులు ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా ప్రజల్లో పోలీస్‌ వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. ఆ దిశగా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించిన నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయడంతో పాటు వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య, పోక్సో, రోడ్డు ప్రమాదాల కేసులపై ప్రతి ఒక్కరూ దృష్టి సారిస్తే జిల్లాలో క్రైమ్‌ రేటు తగ్గించవచ్చన్నారు. సాటుసారా విక్రయాలు, మద్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలని సూచించారు. విజుబుల్‌ పోలీసింగ్‌ పెంచాలన్నారు. రౌడీషీటర్లు, ట్రబుల్‌ మాంగర్లకు క్రమం తప్పకుండా కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. చోరీల నివారణకు రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని ఎస్పీ రత్న సిబ్బందికి సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement