21 నుంచి ఏయూ వారాంతపు తరగతులు
శ్రీకాకుళం: ఆంధ్రా యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్–2024 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఏ, బీకాం 1, 2 సెమిస్టర్లకు ఈ నెల 21 నుంచి వారాంతపు తరగతులు నిర్వహించనున్నట్లు ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సురేఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల(బాలురు)లో జరిగే ఈ తరగతులకు విద్యార్థులు గుర్తింపు కార్డుతో హాజరుకావాలని కోరారు.
డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ
నరసన్నపేట: మండలంలోని గుండవల్లిపేట జాతీయ రహదారిపై గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కుర్దా నుంచి విశాఖపట్నం వైపుకు ప్లై వుడ్ సామగ్రితో వెళ్తున్న లారీ అదుపు తప్పి గుండవల్లిపేట వద్ద డివైడర్‌పైకి ఎక్కింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో డివైడర్‌పై ఆగిపోయింది. అదే వేగంతో సర్వీసు రోడ్డుపైకి వెళ్తే పెను ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. రోడ్డుపై ఆ సమయంలో అనేక మంది ఉన్నారని, అలాగే సర్వీసు రోడ్డుకు ఆనుకొని ఇళ్లు ఉన్నాయని చెప్పారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి డివైడర్ మీదే లారీ ఉండిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు కూడా ఎటువంటి గాయాలు కాలేదు. బుధవారం కోటబొమ్మాళి మండలం పాకివలస, ఇటీవల రణస్థలం వద్ద జరిగిన ప్రమాదాల్లో కార్లు అదుపు తప్పి డివైడర్ దాటి రోడ్డుపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే.
బైకును ఢీకొట్టిన కారు
● తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు
నరసన్నపేట: మండలంలో జమ్ము దాటిన తర్వాత జాతీయ రహదారి(326ఏ)పై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటబొమ్మాళి మండలం ఊడికలపాడుకు చెందిన తండ్రీకొడుకులు వావిలపల్లి సింహాచలం, తవిటయ్యలకు గాయాలయ్యాయి. ఇంటి నుంచి నారాయణవలస సంతకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చల్లపేట వైపు నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సింహాచలంకు ఎడమ చేయి విరగడంతో పాటు తవిటియ్యకు గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు కాగా, కారు ముందు భాగం ధ్వంసమైంది. సింహాచలం ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టూరిస్ట్ బస్సు బోల్తా
● ఇద్దరికి తీవ్ర గాయాలు
కాశీబుగ్గ: పలాస మండలం మాకన్నపల్లి కూడలి సమీపంలో జాతీయ రహదారిపై గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో టూరిస్టు బస్సు బోల్తాపడింది. ఒడిషా రాష్ట్రం బరంపురం పట్టణానికి చెందిన యాత్రికులు రాజస్థాన్‌కు తీర్థయాత్రకు వెళ్లి తిరిగి స్వస్థలాలకు బయలుదేరారు. మాకన్నపల్లి కూడలికి వచ్చేసరికి లారీని ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బరంపురం పట్టణానికి చెందిన రాజేంద్ర బెహరా, కురు బెహరాకు తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వేకువజామున ఘటన జరగడంతో భయాందోళనకు గురైన స్థానికులు తేరుకుని 108కు సమాచారం అందించారు. వెంటనే పలాస 108 ఈఎంటీ మోహనరావు, ఫైలెట్ వెంకటరావులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి అనంతరం పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment