జీవన్‌రావుకు ప్రతిష్టాత్మక అవార్డు
మెళియాపుట్టి: మండలంలోని మర్రిపాడు సి పంచాయతీ పరిధిలోని బంజీరు గ్రామానికి చెందిన ఇంజినీర్ హనుమంతు జీవన్‌రావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరుగుతున్న బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 37వ జాతీయ కన్జెవేషన్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ సదస్సులో జీవన్‌రావును యువ ఇంజనీర్ అవార్డుతో సత్కరించారు. జీవన్‌రావు ఇక్కడే ఏరోస్పేస్ సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రైతు కుటుంబానికి చెందిన యువకుడికి అవార్డు దక్కడం పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు హనుమంతు సాంబయ్య, సంజీవమ్మ సంతోషం వ్యక్తం చేశారు.
బుడుమూరులో
మురుగునీటిపై ఆరా
ఎచ్చెర్ల: లావేరు మండలం బుడుమూరులో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని డీఎల్‌పీవో ఇప్పిలి వెంకటరమణ సిబ్బందిని ఆదేశించారు. మురుగునీరు పేరుకుపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ బీసీ కాలనీవాసులు శనివారం కాలువలో దిగి ధర్నా చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు ఆదివారం గ్రామానికి వెళ్లి పారిశుద్ధ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎల్‌పీవో మాట్లాడుతూ ఇక్కడ కాలువనీరు బయటకు పోయేందుకు ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. మురుగునీరు లేకుండా పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అప్పలనాయుడు, స్థానిక నాయకులు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
జీడిపిక్కలకు
గిట్టుబాటు ధర కల్పించాలి
పలాస: ఉద్దానం ప్రాంత జీడి రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని జీడి రైతాంగ పోరాట ప్రతినిధులు డిమాండ్ చేశారు. బైపల్లి గ్రామంలో కోనేరు కామేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడి మద్దతు ధర విషయంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్యరూపం దాల్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో జీడి పిక్కల గిట్టుబాటు ధర విషయంలో చర్చలు జరపడానికి స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జీడి రైతు సంఘం కన్వీనర్ తెప్పల అజయ్‌కుమార్, కోనేరు రమేష్, బత్తిన లక్ష్మీనారాయణ, అంబటి రామకృష్ణ, కొర్ల హేమారావు చౌదరి, వాసుపల్లి సాంబమూర్తి, జోగి అప్పారావు, తెప్పల చాణుక్య, బొంపెల్లి శివకుమార్, గుల్ల ఈశ్వరరావు, సానా కృష్ణారావు, తామాడ పోలయ్య తదితరులు పాల్గొన్నారు.
సవరణ జీఓ 117లో లోపాలు సరిదిద్దాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: జీఓ 117 సవరణలో లోపాలను సరిదిద్ది విద్యావ్యవస్థను కాపాడాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.రమణమూర్తి, జి.రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడల్ ప్రైమరీ స్కూల్ పంచాయతీ కేంద్రంగా ఏర్పాటు చేయడం శుభపరిణామమే అయినా సమీప పాఠశాలల నుంచి మూడు, నాలుగు, ఐదు తరగతులను మోడల్ ప్రైమరీ స్కూల్లో కలపకుండా వాటిని పాతపద్ధతిలో ప్రైమరీ స్కూల్‌గానే కొనసాగించాలని కోరారు. మోడల్ ప్రైమరీ స్కూలు పంచాయతీ కేంద్రంగా ఉండాలని, అప్‌గ్రేడ్ కాకుండా మిగిలిన యూపీ స్కూలును యథావిధిగా కొనసాగించాలన్నారు. అన్ని ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్, పీఈటీ పోస్టులు ఉండాలని, ఎంటీఎస్ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. విద్యాశాఖామంత్రి దృష్టికి సమస్య తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు, జి.శ్రీనివాసరావు, కె.తేజేశ్వరరావు, ఎ.జగన్, ఎం.తేజేశ్వరరావు, డీవీఎన్ పట్నాయక్, జె.శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment