మృత్యువులోనూ వీడని స్నేహబంధం
ఇచ్ఛాపురం: అతివేగం ఇద్దరు ప్రాణస్నేహితులను ప్రాణాలను బలిగొంది. ఇచ్ఛాపురం పట్టణంలోని సంతపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పాత్రపూర్ బ్లాక్ బొరివాడా గ్రామానికి చెందిన కాసులదేవి కార్తీక్(23), బొనసోలా గ్రామానికి చెందిన ఇసురు వినోద్(22) స్నేహితులు. కార్తీక్ హైదరాబాద్‌లో వెల్డర్‌గా, వినోద్ స్వగ్రామంలోనే మెకానిక్‌గా పని చేస్తున్నారు. సంక్రాంతి పండగ కోసం సొంతూరికి వచ్చిన కార్తీక్ ఒడిశాలో కొత్త బైక్‌ని కొనుగోలు చేశాడు. నంబర్‌ప్లేట్ కోసం ఆదివారం స్నేహితుడు వినోద్‌తో కలిసి బరంపురం వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా ఇచ్ఛాపురం పట్టణంలో సంతపేట వద్దకు చేరేసరికి అతివేగంతో బైక్‌ని నడపడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. అవతలవైపు రోడ్డులోకి సైతం దూసుకుపోయి మరో ద్విచక్రవాహనంపై వస్తున్న సోంపేట మండలం మాకన్నపురం గ్రామానికి చెందిన చిత్రాడ రమేష్, సిద్దార్ధ, పలాస మండలం తాలబద్రకు హనుమంత్ కార్తీక్‌లను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా రమేష్, హనుమంతు కార్తీక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సిద్దార్థకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్సులో ప్రభుత్వ సామాజికి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హెచ్‌సీ అప్పారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ సామాజికి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మృతులు కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకొని బోరున విలపించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఒడిశా యువకులు మృతి
మరో ముగ్గురికి గాయాలు
అతివేగమే ప్రమాదానికి కారణం
Comments
Please login to add a commentAdd a comment