● నేటి నుంచే ధ్రువపత్రాల పరిశీలన ● ప్రత్యేక వైద్య బృందాలు సిద్ధం ● ఇంటింటి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలన ● ఐదు నెలల పాటు కొనసాగనున్న ప్రక్రియ ● ఆస్పత్రిలో సేవలకు అంతరాయం!
శ్రీకాకుళం:
జిల్లాలో భరోసా పింఛన్లు పొందుతున్న దివ్యాంగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దివ్యాంగుల పింఛన్లు రూ.3వేలు నుంచి రూ.6వేలకు పెంచిన కూటమి ప్రభుత్వం ఆ భారం తగ్గించుకునే ప్రయత్నం చేపట్టింది. పింఛన్లు పొందుతున్న దివ్యాంగుల అంగవైకల్య ధ్రువీకరణ పత్రాలను పునఃపరిశీలించాలని వైద్యులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. జోన్–2 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సోమవారం నుంచి వైద్య బృందాలు మండల స్థాయిలో పర్యటించి ధ్రువపత్రాలను పునఃపరిశీలన చేయనున్నారు.
యాప్‌లో నమోదు..
గతంలో సదరం ప్రక్రియను పక్కాగా నిర్వహించి ధ్రువపత్రాలు జారీ చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం దానిని కాదని అనర్హుల పేరిట ఏరివేతకే కొత్త ప్రయత్నాలను ప్రారంభించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఓ యాప్‌ను సైతం రూపొందించింది. డాక్టర్లు పునఃపరిశీలన చేసిన తర్వాత ప్రత్యేక యాప్‌లో ప్రభుత్వం అడిగిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో వివరాలను నమోదు చేస్తే ఇప్పటికే ఉన్న దివ్యాంగ పింఛన్ లబ్ధిదారుల్లో 40 నుంచి 50 శాతం వరకు అనర్హులు అవుతారని వైద్యులే చెబుతుండటం గమనార్హం. మూడు జిల్లాల్లో 12 బృందాలను ఏర్పాటు చేయగా ఆయా వైద్యులు ప్రక్రియను పూర్తి చేసేందుకు సుమారు ఐదు నెలలు పడుతుందని సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 31584 మంది దివ్యాంగ లబ్ధిదారులు పింఛన్లు పొందుతుండగా వీరిలో 8వేల మంది మంచానికే పరిమితమైన వారు ఉన్నారు. మొదటి విడతలో మంచానికే పరిమితమైన వారి వివరాలను సేకరిస్తారు. తర్వాత మిగిలిన వారి దివ్యాంగత్వాన్ని గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment