జనవరి 11 నుంచి టీసీసీ పరీక్షలు
సూర్యాపేటటౌన్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఎగ్జామినేషన్ లోయర్, హయ్యర్‌లో టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరీక్షలు జనవరి 11 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. టైలరింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట కుట్టు మిషన్ తీసుకురావాలని తెలిపారు.
భూ సేకరణ పరిశీలన
తిరుమలగిరి (తుంగతుర్తి): చొక్యారావు దేవాదుల ప్రాజెక్టు కాల్వ 10ఆర్11ఆర్ భూ సేకరణను అదనపు కలెక్టర్ రాంబాబు శనివారం పరిశీలించారు. తిరుమలగిరి, మాలిపురం గ్రామాల నుంచి వెళ్తున్న కాల్వల భూ సేకరణపై అధికారులతో మాట్లాడారు. భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ హరిప్రసాద్, ఆర్‌ఐ సుజిత్‌రెడ్డి, సర్వేయర్ జోసఫ్ పాల్గొన్నారు.
అమిత్‌షాను
బర్తరఫ్ చేయాలి
భానుపురి (సూర్యాపేట): రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కొలిశెట్టి యాదగిరిరావు, పారేపల్లి శేఖర్ రావు, ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.
ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్
జిల్లా కమిటీ ఎన్నిక
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రవాణా రంగంలో పని చేస్తున్న లారీ, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, గూడ్స్ లారీలు, ప్రైవేట్ స్కూల్ బస్సు కార్మికుల జిల్లా కార్యవర్గాన్ని శనివారం సూర్యాపేటలోని సీఐటీయూ కార్యాలయంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా యాదగిరి, ఉపాధ్యక్షులుగా సాయికుమార్, ఉపేందర్, సైదయ్య, రామ్మూర్తి, కార్యదర్శిగా రాంబాబు, సహాయ కార్యదర్శులుగా స్వరాజ్యం, యరయ్య, వేలాద్రి, వెంకన్న,కోశాధికారిగా కిషోర్ కుమార్‌ను ఎన్నుకున్నారు.
ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
నడిగూడెం: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని గృహ నిర్మాణ శాఖ ఈఈ విజయ్ సింగ్ అన్నారు. శనివారం నడిగూడెం మండల కేంద్రంతో పాటు, కాగితరామచంద్రాపురం, కరివిరాల, చెన్నకేశ్వాపురం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను ఆయన పరిశీలించారు. అనంతరం సర్వే సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట ఎంపీడీఓ సయ్యద్ ఇమామ్, ఏఈ అనిల్ నాయక్, ప్రత్యేక అధికారి అబ్దుల్లా ఉన్నారు.
23న పోలీస్ వాహనాల పాత విడి భాగాలకు వేలం
సూర్యాపేటటౌన్ : జిల్లా పోలీసు ప్రభుత్వ వాహనాల పాత విడి పరికరాల(బ్యాటరీలు, టైర్స్)కు సోమవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా పోలీస్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి సురేష్ శనివారం తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ఉదయం 9గంటలకు ఇందిరమ్మ కాలనీలో గల పోలీస్ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment