మఠంపల్లిలో అగ్రి కళాశాల
హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో మఠంపల్లి మండలంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో వ్యవసాయ కళాశాలలు లేవు. ఈ రెండు జిల్లాల్లో వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఈనేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ కళాశాల ఏర్పాటుకు ఐకార్ నిబంధనల మేరకు దాదాపు 75 ఎకరాల నుంచి 100 ఎకరాల భూమి అవసరం అవుతుందని భావిస్తున్నారు. ఈమేరకు అధికారులు స్థల పరిశీలన చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలన
మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 247లో దాదాపు 300 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమి ఆక్రమణలకు గురైంది. కళాశాల కోసం దాదాపు 100 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమిని సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఆయా భూములను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. స్థానికులు, ఉన్నతాధికారులు సమ్మతించిన అనంతరం భూసేకరణ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.
విద్యార్థులకు ఎంతో సౌకర్యం
ఈ ప్రాంతంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో వ్యవసాయ కోర్సు చదివే విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా మారనుంది. ఇప్పటి వరకు అగ్రికల్చర్ విద్యార్థులు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ తదితర జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం మఠంపల్లి మండలంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు కానుండడంతో విద్యార్థులకు దూరభారం తగ్గడమే కాకుండా మరింత సౌకర్యవంతం కానుంది.
నాలుగేళ్ల కోర్సు, ఎనిమిది సెమిస్టర్లు
మఠంపల్లిలో ఏర్పాటు కానున్న వ్యవసాయ కళాశాలలో 50 నుంచి 100 మంది విద్యార్థులకు అవకాశం ఉండనుంది. దాదాపు 80 నుంచి 100 మంది వరకు బోధనా, బోధనేతర సిబ్బంది ఉంటారు. వ్యవసాయ కళాశాలలో ప్రవేశాలకు విద్యార్థులు బీఎస్సీ డిగ్రీ కోర్సు చదవాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ చదివే విద్యార్థులకు నాలుగేళ్ల కోర్సులో 8 సెమిస్టర్లు ఉంటాయి. వివిధ కేటగిరీల వారీగా దాదాపు 12కు పైగా విభాగాలు (సబ్జెక్టులు) ఉంటాయి.
ఫ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం
ఫ రఘునాథపాలెం శివారులోని ప్రభుత్వ భూమిలో స్థల పరిశీలన
ఫ స్థానికులు, ఉన్నతాధికారులు
సమ్మతించిన అనంతరం భూసేకరణ
ఫ 50 నుంచి 100 మంది
విద్యార్థులకు అవకాశం
Comments
Please login to add a commentAdd a comment