ముని్సపాలిటీలకు ఊరట
హుజూర్‌నగర్: నిధులు లేక నీరసించి పోతున్న మున్సిపాలిటీలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి స్టాంపు డ్యూటీ, ఆస్తి మార్పిడి రుసుము నుంచి రావాల్సిన రూ.50.67 కోట్ల బకాయి నిధులను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. 2019 నుంచి స్టాంపు డ్యూటీ, 2022 నుంచి ఆస్తి మార్పిడి రుసుము ద్వారా వచ్చిన పన్ను బకాయిల వాటాను జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ప్రత్యేక ఖాతాల్లో జమచేసింది. దీంతో మున్సిపాలిటీలకు ఊరట లభించింది.
మార్గదర్శకాలు ఇలా..
మున్సిపాలిటీలకు మంజూరు చేసిన నిధుల వినియోగానికి సంబంధించిన ప్రభుత్వం ఈ నెల 6న మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక నిధుల నుంచి మున్సిపాలిటీల్లో ఒప్పంద కార్మికులు, ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించవచ్చు. యాజమాన్య వాటా కింద కార్మికుల ఖాతాకు ఈఎస్‌ఐ, భవిష్యనిధి బకాయిలను జమచేయవచ్చు. విద్యుత్ బిల్లుల బకాయిలను పరిష్కరించవచ్చు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి జీఎస్టీ, ఆదాయపు పన్ను, సీనరేజ్, లేబర్ సెస్సు బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం సూచించిన బకాయిల చెల్లింపుల అనంతరం మిగులు నిధులు ఉంటే తదుపరి మార్గదర్శకాలు వచ్చే వరకు వాటిని వినియోగించవద్దని ఆదేశించింది. ఇందుకు భిన్నంగా చెల్లింపులు జరగకుండా ఖజానా ఆధికారులకు ఆదేశాలు జారీచేసింది.
తీవ్ర నిరాశలో పాలకవర్గాలు
నిధుల వినియోగంపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిన నేపథ్యంలో మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు అసంతృత్తితో ఉన్నారు. ఈనెల 27న మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు పెండింగ్ బిల్లుల చెల్లింపులు, వార్డుల్లో చేయాల్సిన పనులకు నిధుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. విడుదలైన స్టాప్ డ్యూటీ నిధులతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేకపోవడంతో పాలకవర్గాలు తీవ్ర నిరాశకు గురవుతున్నాయి.
స్టాంపు డ్యూటీ బకాయిలు రూ.50.67 కోట్లు విడుదల
ఫ ప్రత్యేక ఖాతాల్లో జమ అయిన డబ్బులు
ఫ వినియోగంపై అధికారులకు
మార్గదర్శకాలు జారీ
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఖర్చు చేస్తాం
మున్సిపాలిటీలకు ప్రభుత్వం నుంచి ఇటీవల నిధులు మంజూరయ్యాయి. అయితే ఆయా నిధుల వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం నిధులను వినియోగిస్తాం.
– కె.శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్, హుజూర్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment