భరోసా వైపు అడుగులు
భానుపురి (సూర్యాపేట) : ఇందిరమ్మ రైతు భరోసా పథకం అమలుకు కసరత్తు మొదలైంది. ఈనెల 26వ తేదీన ఈ పథకానికి అర్హులైన రైతుల అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమచేయనుంది. సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సాగుకు అనుకూలంగా లేకున్నా పట్టాదారు పాసు పుస్తకాలున్న భూముల వివరాల సేకరణకు గురువారం నుంచి బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లాయి. సర్వే నంబర్ల వారీగా గుట్టలు, రాళ్లు, ప్లాట్లుగా విక్రయించిన భూములు వివరాలను సేకరించి భూభారతి పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియ 20వ తేదీ వరకు కొనసాగనుంది. 24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి, 25న అర్హుల తుది జాబితా ప్రకటించనున్నారు. ఎలాంటి పరిమితి లేకుండా సాగు భూములకు పెట్టుబడి సాయం ఇవ్వడంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
ఎకరానికి రూ.12వేల చొప్పున..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018 నుంచి రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందించింది. జిల్లాలో సుమారు 2.70 లక్షల మంది రైతులకు ఈ పథకంతో ప్రయోజనం కలిగింది. ఎకరానికి రూ.10వేలను రెండువిడతల్లో ఇవ్వగా.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ప్రకటించింది. ప్రజా పాలనలో దరఖాస్తులను స్వీకరించగా 1,60,334 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుపై తీవ్ర కసరత్తు చేసింది. పెట్టుబడి సాయం ఐదెకరాలకు లేదా ఏడెకరాలు, 10 ఎకరాల వరకు పరిమితి ఉంటుందన్న చర్చలు కొనసాగాయి. చివరకు ఎలాంటి పరిమితి లేకుండా సాగుకు అనుకూలమైన భూములన్నింటికీ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రూ.15వేలను కాస్త ఎకరానికి రూ. 12 వేల చొప్పున రెండు విడతల్లో ఇవ్వనున్నారు.
మార్గదర్శకాల రాకతో క్షేత్రస్థాయికి..
రైతుభరోసా కింద సాగుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12వేలు అందించనున్నారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు, గుట్టలు, రోడ్డు నిర్మాణంలో కోల్పోయిన భూములు, మైనింగ్ భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, సాగునీటి ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకం వర్తించదు. ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేయడంతో ఈ భూములను గుర్తించేందుకు గాను అధికారుల బృందాలు క్షేత్రస్ధాయికి చేరుకుని సర్వే చేస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సర్వే కొనసాగుతుంది. ఈ బృందంలో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు. పంచాయతీ కార్యదర్శి, ఏఓలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఫీల్డ్ వెరిఫికేషన్ బృందం లీడర్లుగా, రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఆర్‌ఏ, ఏఈఓలు సభ్యులుగా ఉన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో డీఏఓలు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేకాధికారులు ఈ బృందాల సర్వే తీరును మొదటిరోజు పర్యవేక్షించాయి.
అనర్హులను గుర్తించేందుకు సర్వే ప్రారంభం
ఫ సాగుకు యోగ్యం కాని భూముల
వివరాలు సేకరిస్తున్న అధికారులు
ఫ 20 వరకు సాగనున్న ప్రక్రియ
ఫ రిపబ్లిక్ డే రోజున రైతు భరోసా డబ్బులు జమ చేసేలా ప్రణాళిక
Comments
Please login to add a commentAdd a comment