సర్వేను సమగ్రంగా నిర్వహించాలి
హుజూర్‌నగర్‌రూరల్ : రైతు భరోసాలో భాగంగా సాగుకు యోగ్యం కాని భూముల సర్వేను అధికారులు సమగ్రంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. గురువారం హుజూర్‌నగర్ మండలం అమరవరం, అమర్‌నగర్ గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు చేస్తున్న సర్వేను ఆర్డీఓ శ్రీనివాసులుతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకంలో పంటలు సాగు చేసిన, అర్హులైన రైతులు నష్టపోకుండా చూడాలని, వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ రవి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, మండల వ్యవసాయాధికారిణి రావిరాల స్వర్ణ, ఆర్‌ఐ సత్యనారాయణ, ఏఈఓ, కార్యదర్శి పాల్గొన్నారు.
సాగుకు యోగ్యమైన భూమికే రైతు భరోసా
అర్వపల్లి: సాగుకు అమోదయోగ్యమైన భూమికే రైతు భరోసా వర్తిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో గుట్టల వద్ద చేస్తున్న సర్వేను గురువారం పరిశీలించి మాట్లాడారు. ఈనెల 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రత్యేక టీంలను నియమించామన్నారు. ఈకార్యక్రమంలో ఏఓ పి.గణేష్, ఏఈఓ నేరెళ్ల సత్యం, సీనియర్ అసిస్టెంట్ రామరాజు జలేందర్‌రావు, గిర్దావర్ పాటి వెంకట్‌రెడ్డి, ఖమ్మంపాటి సైదులు పాల్గొన్నారు.
గోదావరి జలాల పునరుద్ధరణ
అర్వపల్లి: గోదావరి జలాలను జిల్లాకు గురువారం పునరుద్ధరించారు. వారబందీ విధానంలో భాగంగా వారం రోజుల పాటు ఈ జలాలు జిల్లాకు రానున్నాయి. తొలుత 597 క్యూసెక్కుల నీటిని జిల్లాకు వదిలారు. ఇందులో 69 డీబీఎంకు 150, 70 డీబీఎంకు 50, మిగిలిన 397 క్యూసెక్కుల నీటిని 71డీబీఎంకు వదులుతున్నారు. కాగా శుక్రవారం గోదావరి జలాలను పెంచనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం వదిలిన నీళ్లు తూములకు ఎక్కే పరిస్థితి లేదని వెంటనే నీటిని పెంచాలని అన్నదాతలు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజలంతా
సోదరభావంతో మెలగాలి
మేళ్లచెరువు : ప్రజలంతా సోదరభావంతో మెలగాలని నల్లగొండ బిషప్ కరణం దమన్‌కుమార్ సూచించారు. మేళ్లచెరువులోని ఆర్‌సీఎం చర్చి వంద వసంతాల వేడుకలతో పాటు చర్చిలో గర్భగుడి ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. బిషప్ చేతుల మీదుగ దివ్యబలి పూజ చేయించారు. మరియమాత విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలంతా ప్రేమ, కరుణ కలిగి ఉండాలని, దైవభక్తితో కలిసిమెలిసి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాస్టర్‌లు, గురువులు, దేవాలయ పెద్దలు, భక్తులు, విచారణ గురువులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment