సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్రం, వివిధ పరిశ్రమలు రూ.70 కోట్ల వ్యయంతో దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ఈ అత్యాధునిక నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (3డీ ప్రింటింగ్ సెంటర్)ను ఏర్పాటు చేసిన్నట్లు వారు పేర్కొన్నారు.
ఓయూ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రంలో ఏరోస్పేస్, డ్రోన్లు, మానవ కృత్రిమ అవయవాలు, ఆటోమొబైల్ పరికరాలు, అన్ని రకాల పరిశ్రమలకు ఉపయోగపడే వస్తువులను తయారుచేస్తారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ చెప్పారు.
3డీ ప్రిటింగ్ రూపకర్త ప్రొ.శ్రీరామ్ వెంకటేష్
ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ 2002 నుంచి 3డీ ప్రింటింగ్ సబ్జెక్టును ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధిస్తున్నారు. ఈ సబ్జెక్టుపై అనేక పరిశోధనలు చేసిన ఆయన 2007లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ నుంచి రూ.కోటి ప్రాజెక్టును పొందారు. దీంతో ప్రత్యేకంగా పరికరాలను, యంత్రాలను కొనుగులు చేసి 3డీ సెంటర్‌ను అభివృద్ధి చేశారు. ఆ విధంగా ఓయూలో అంకురించిన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ నేడు జాతీయస్థాయి ప్రింటింగ్ కేంద్రం స్థాపనకు దోహదపడిందని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment