అందరి నోటా 6 గ్యారంటీలు
కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటితో 100 రోజులు
ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ప్రభుత్వం
గడువు పూర్తి కావడంతో రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చ
పార్టీ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల పేరిట 13 హామీలు
ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు షురూ
రైతు భరోసా, విద్యా భరోసా, పింఛన్ల పెంపు తదితరాలపై దృష్టి సారించని సర్కారు
హామీలన్నీ నెరవేరాలంటే ఏటా రూ.1.30 లక్షల కోట్లు అవసరమన్న నిపుణులు
బడ్జెట్‌లో రూ.53 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. శుక్రవారంతో కాంగ్రెస్ పాలనకు వంద రోజులు పూర్తి కానుండటంతో, ప్రభుత్వ పనితీరుపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంత స్వల్ప వ్యవధిలో ప్రభుత్వ పనితీరును అంచనా వేయడం సరికాక పోయినా, ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటన చేయడం చర్చకు తావిచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల పేరుతో 13 హామీలను పొందుపరిచింది.
ఈ 13 పథకాల అమలుకు ఏటా దాదాపు రూ.1.30 లక్షల కోట్లు అవసరమని నిపుణులు అంచనా వేశారు. కానీ ప్రభుత్వం వీటికి బడ్జెట్‌లో రూ.53 వేల కోట్లే కేటాయించింది. దీనిపై అప్పట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా ఇప్పటివరకు ఐదు హామీలను ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఇంకా ఎనిమిది హామీలు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం తీవ్రమవుతున్న తాగునీరు, విద్యుత్ సమస్యలను కూడా ప్రభుత్వం అధిగమించాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వంద రోజుల్లో తాను సాధించిన విజయాలను వివరిస్తూ ప్రభుత్వం గురువారం ప్రగతి నివేదిక విడుదల చేసింది.
ఎన్నికల తర్వాతే మిగతా హామీల అమలు?
అధికారంలోకి వచ్చిన రెండోరోజే డిసెంబర్ 9న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత 50 రోజులకు పైగా సమయం తీసుకుని ఫిబ్రవరి 28న మరో రెండు పథకాలు షురూ చేసింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించింది.
అనంతరం 12 రోజుల సమయం తీసుకుని మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. పార్లమెంటు ఎన్నికల కోడ్‌కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో, ఆరు గ్యారంటీల్లో అమలు కాకుండా మిగిలిన 8 హామీల అమలు లోక్‌సభ ఎన్నికల తర్వాతేనని అర్థమవుతోంది.
వ్యతిరేకత రాలేదేమో కానీ..
వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు విషయమై ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా ఒకింత అసంతృప్తి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు అందరికీ పథకాలు అందజేస్తామని చెప్పి.. ఇప్పుడు తెల్ల రేషన్‌కార్డు, ప్రజాపాలన దరఖాస్తు పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు ఎలాంటి లబ్ధీ పొందనివారు, భవిష్యత్తులో ప్రారంభించే పథకాల్లోనైనా తమకు లబ్ధి కలుగుతుందో లేదోననే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సంక్షేమ పథకాల అమలుకు ఏదో ఒక కొలబద్ధ ఉండాలి కదా... అందుకే తెల్ల రేషన్‌కార్డు నిబంధన అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వం వివరణ ఇవ్వడం గమనార్హం.
ఒక్క మహాలక్ష్మికే రూ.40 వేల కోట్లకు పైగా
రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ప్రకటించింది. మహాలక్ష్మి పేరుతో రూపొందించిన తొలి గ్యారంటీలోని మొదటి అంశం ఇదే. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 1.65 కోట్ల మంది మహిళలున్నారు. వీరిలో పింఛన్లు పొందుతున్న 26 లక్షల మంది పోను మిగిలిన వారికి నెలకు రూ.2,500 చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.41,700 కోట్లు కావాల్సి ఉంటుంది.
వరికి బోనస్ వచ్చే సీజన్ నుంచా?
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మరో ప్రధాన గ్యారంటీ రైతు భరోసా. రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలతో పాటు క్వింటాలు వరికి రూ.500 బోనస్ ఇందులోని ప్రధాన హామీలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసినా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వలేదు. అయితే వచ్చే వర్షాకాలం సీజన్ నుంచి దీనిని అమలు చేయవచ్చని తెలుస్తోంది. రైతు భరోసా అమలు చేయాలంటే ఏటా కనీసం రూ.34 వేల కోట్లు కావాల్సి ఉంటుంది.
చేయూత.. ఎప్పుడో?
రాష్ట్రంలోని పేదలు అత్యంత ఆతురతతో ఎదురుచూస్తున్న మరో గ్యారంటీ చేయూత. ఈ గ్యారంటీ కింద రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచాల్సి ఉంది. దీని కోసం 46 లక్షలకు మందికి పైగా పేదలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా చేయూత పథకాన్ని అమలు చేయాలంటే ఏటా రూ.18 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి రానుంది.
యువ వికాసం... గందరగోళం
యువ వికాసం గ్యారంటీలో భాగంగా ఇంటర్ నుంచి వృత్తి విద్యా కోర్సుల వరకు అన్ని స్థాయిల్లోని విద్యార్థులకు ఫీజుల నిమిత్తం రూ.5 లక్షల విలువైన విద్యాభరోసా కార్డులు ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ కార్డు ఎలా ఇస్తారు? ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందా? వడ్డీ ఎవరు భరిస్తారు? లాంటి వాటిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
ఇప్పటివరకు ఇవీ..
ఆరు గ్యారంటీల్లో భాగంగా తొలుత ప్రారంభించింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి. ఈ పథకం ప్రారంభించే నాటికి ఆర్టీసీ బస్సుల్లో సగటు ఆక్యుపెన్సీ రేషియో 66 శాతం మాత్రమే. కానీ పథకం ప్రారంభమయ్యాక అది క్రమంగా వంద శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన మహిళల సంఖ్య 25 కోట్లను మించిపోయింది. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక గృహజ్యోతి కింద తొలి నెలలో లబ్ధి పొందిన వారి సంఖ్య తక్కువగానే ఉంది.
రాష్ట్రంలో 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తున్న గృహ కనెక్షన్ల సంఖ్య 95.23 లక్షలు కాగా, తెల్ల రేషన్‌కార్డు, ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో లబ్ధిదారుల సంఖ్య సగానికి పైగానే తగ్గిందని తెలుస్తోంది. మరోవైపు ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రంలోని 20 లక్షల మందికి ఇళ్ల సౌకర్యం కల్పించాలన్నది లక్ష్యం కాగా, ప్రస్తుతం సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల నగదు సాయం పథకాన్ని ప్రారంభించారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభమైంది.
దరఖాస్తు చేసుకోని వారి పరిస్థితేమిటి?
ప్రజాపాలన కార్యక్రమంలో సంక్షేమ పథకాల కోసం 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందులో డూప్లికేషన్లు, ఇప్పటికే లబ్ధి పొందిన దరఖాస్తులు కూడా ఉన్నాయని ప్రభుత్వం చెపుతోంది. ఇదిలావుంటే అసలు చాలా మంది ప్రజలు ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోలేదు. దీంతో తెల్ల రేషన్‌కార్డు ఉన్నప్పటికీ పథకాల లబ్ధి పొందలేకపోవడం గమనార్హం.
ప్రతి నాలుగు నెలలకోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం చెపుతోంది. ఈ లెక్కన ఏప్రిల్ నెలాఖరులో మరోమారు ప్రజాపాలన నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీలు ఆరు గ్యారంటీల అమలుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 100 రోజుల్లో అమలు సాధ్యం కాదని తెలిసీ ఎందుకు గ్యారంటీ ఇచ్చారని ప్రశి్నస్తున్నాయి. వంద రోజులు పూర్తయిన తర్వాత పోరాట కార్యాచరణకు పూనుకుంటామని హెచ్చరిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment