విభజించు.. పెళ్లి వేడుక ఆనందించు | Coronavirus Effect on Weddings And Functions in Hyderabad | Sakshi
Sakshi News home page

విభజించు.. పెళ్లి వేడుక ఆనందించు

Published Wed, Aug 5 2020 7:50 AM | Last Updated on Wed, Aug 5 2020 8:04 AM

Coronavirus Effect on Weddings And Functions in Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నగరానికి చెందిన ఓ లాయర్‌ ఒకరు ఏప్రిల్‌ 5న పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కాని ఆమె తన 3 రోజుల పెళ్లి సంబరాలను  రద్దు చేసుకున్నారు. స్నేహితులు సింపుల్‌ సెర్మనీ చేసుకోవాలని సూచించినా.. ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే..ఆమె పెళ్లికి  యూకె, మలేసియా, సింగపూర్‌ వంటి దేశాలకు చెందిన స్నేహితులు రావాల్సి ఉంది. అదే విధంగా బంధువులు, స్నేహితులు లేని పెళ్లిని అంగీకరించలేని జంటల కారణంగా వందలాది పెళ్లిళ్లు ఆగిపోయాయి. పెళ్లిళ్లు కోసం ముందుగా బుక్‌ చేసుకున్న హోటల్‌ వాళ్లు రద్దయినా డబ్బులు రిఫండ్‌ ఇవ్వమంటున్నారు. తదుపరి పెళ్లి వేడుకకు దాన్ని అడ్వాన్స్‌గా పరిగణిస్తామని మాత్రం చెబుతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌ : కొంతకాలంగా పార్టీలకు, సెలబ్రేషన్స్‌కు సిటీ కేరాఫ్‌గా మారింది. ఆఫీస్‌లో ప్రమోషన్‌ దగ్గరనుంచి లవర్‌తో బ్రేకప్‌ దాకా కాదేదీ వేదికకు అనర్హం అన్నట్టుగా సిటిజనులు సందడిగా గడిపేసేవారు. చిన్ని చిన్న విషయాలకే ట్రీట్స్‌ ఇచ్చి పుచ్చుకోవడం సాధారణంగా మారిన నగరంలో.. పెళ్లి అనేది అన్నింటికన్నా అతిపెద్ద వేడుకగా అవతరించింది. బిగ్‌ ఫ్యాట్‌ వెడ్డింగ్స్‌ అనేవి సహజంగా మారిపోయాయి. ఈ చరిత్రని సమూలంగా తిరగరాసింది కరోనా. ఎంత పెద్దవాళ్లయినా సరే సింపుల్‌ పెళ్లివేడుకలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చింది. కరోనా నేపథ్యంలో సిటీ పెళ్లిళ్ల చుట్టూ అల్లుకుంటున్న మార్పు చేర్పులే ఈ కధనం.. 

ఇంటిమేట్‌...ఇంట్లోనే ట్రీట్‌... 
బిగ్‌ ఫ్యాట్‌ ఇండియన్‌ వెడ్డింగ్‌ ఇప్పుడప్పుడే సాధ్యం కాదనేది వాస్తవం.  అతిథుల సంఖ్య 150కి మించని సింపుల్‌ పెళ్లిళ్లను ఇప్పుడు ఇంటిమేట్‌ వెడ్డింగ్స్‌గా పేర్కొంటున్నారు. వాయిదాకు ఇష్టపడని వాళ్లు ఇప్పుడు వీటికే మొగ్గు చూపుతున్నారని ఓ  వెడ్డింగ్‌ ఈవెంట్‌ ప్లానర్‌ సంస్థ ప్రతినిధి చెప్పారు. ఇళ్ళలో కాకపోతే గుడులలో, పార్కులు, బొటిక్‌ హోటల్స్, జంటల అభిమాన రెస్టారెంట్స్‌ సైతం ఇప్పుడు పెళ్లి వేదికలుగా మారిపోతున్నాయి. అక్టోబరు నెలాఖరు వరకూ భారీ పెళ్ళిళ్ల గురించి కనీసం ఆలోచన కూడా చేయడం అనవసరమని క్రాఫ్టెడ్‌ వెడ్డింగ్స్‌ అండ్‌ ఈవెంట్స్‌ నిర్వాహకురాలు శ్వేతా సర్ధా స్పష్టం చేస్తున్నారు.

జాగ్రత్తలెన్నో.. 
ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితుల్లో అతిథిని మనం ఎలా ఆహ్వానిస్తున్నాం అనేది కూడా చాలా ప్రాధాన్యం దక్కించుకుంటోదని నగరానికి చెందిన ఇన్విటేషన్‌ డిజైనర్‌ ఉత్తర చెప్పారు. ఆహ్వానితుల జాబితా పరిమితంగా, అదే సమయంలో వచ్చేవారికి సురక్షితభావన కలిగించేలా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారామె. పెళ్లికి ముందు ఆహ్వానించిన అతిధుల్లో ప్రతి ఒక్కరినీ 2 వారాల తర్వాత వారి ఆరోగ్యం గురించి వాకబు చేశామని తాజాగా పెళ్లి చేసుకున్న వధూవరుల జంట చెప్పారు. పెళ్లిళ్లు జరిగే చోట హైజీన్‌ స్టాండర్డ్స్‌ ఎన్నడూ లేని విధంగా పాటిస్తున్నారు. నగరానికి చెందిన ఓ డిజైనర్‌ తన పెళ్లి వేడుకల కోసం 100 బాటిల్స్‌ శానిటైజర్స్‌ను బఫెట్‌ కౌంటర్స్‌ దగ్గర జత చేశారు. ప్లేట్స్‌ , బౌల్స్‌ వంటివి తీసుకునే ముందు, జంటని వేదికపై కలిసి శుభాకాంక్షలు చెప్పేముందు గెస్ట్స్‌ వాటిని వినియోగిస్తున్నారు. వేడుకల్లో సేవలందించే స్టాఫ్‌ మొత్తం మాస్కులు, వడ్డించేవారు పూర్తిగా ఆసుపత్రుల తరహాలో పీపీఈ కిట్స్‌ ధరిస్తున్నారు. పెళ్లిలో ఫొటోలు తీయడానికి ఒప్పందం కుదర్చుకునే ముందే తమ టీమ్‌ మెడికల్‌ రికార్డ్స్‌ అడుగుతున్నారని ఓ ఫొటోగ్రాఫర్‌ చెప్పారు. అలాగే పెళ్లికి కొన్ని రోజుల ముందు పాజిటివ్‌ లక్షణాలు కనపడితే మరో ప్రత్యామ్నాయ ఫొటోగ్రాఫర్‌ని పంపుతాం లేదా అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేస్తాం అని క్లాజ్‌ కూడా పెడుతున్నారని తెలిపారు. ఇదే పరిస్థితి పెళ్లిళ్లలో సేవలు అందించే ప్రతి ఒక్కరికి ఎదురవుతోంది.  

విభజించు..పెళ్లి వేడుక ఆనందించు 
అన్నట్టుగా వెడ్డింగ్‌ ప్లానర్‌ పునీత్‌ జసుజా సలహా ఇస్తున్నారు. ఓ 750 మంది అతిథులను ఈవెంట్ల వారీగా విభజించమని ఆయన సూచిస్తున్నారు. సగటున 150 మంది చొప్పున అతిధులతో వీటిని ఏర్పాటు చేయమంటున్నాడు. అదే వేదిక, అదే డెకార్‌... తో రిసెప్షన్‌ని 2 రోజుల పాటు నిర్వహించవచ్చునని, పెద్దవాళ్లని సంప్రదాయ వేడుకలకు, యువతని కాక్‌టైల్‌ పార్టీస్‌కి, సంగీత్‌కి.. ఇలా విభజించవచ్చునంటున్నారు. 

కుప్పకూలిన ఆధారిత రంగాలు.. 
భారీ పెళ్లిళ్లు, డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ అనేవి లేకపోవడంతో   హాల్‌ డెకరేటర్స్, ఫ్లోరిస్ట్సŠ, కేటరర్స్, లైట్‌మెన్, మేకప్‌–హెయిర్‌స్టైలిస్టులు, ఫొటో –వీడియో గ్రాఫర్స్, ఇంకా మరెందరో... ఈ రంగంపై ఆధారపడిన వేలాది మంది పూర్తిగా ఉపాధి కోల్పోయినట్టే.  ఓ జ్యుయలరీ షాప్‌ గత ఏడాది ఏప్రిల్‌ నెలలో వెడ్డింగ్‌ ఆభరణాలను 1000 వరకూ తయారు చేసింది. ఈ ఏడాది ఆ సంఖ్య కేవలం 10 మాత్రమేనని షాప్‌ యజమాని చెప్పారు. ‘‘ఇంట్లో లేదా ఇంటిమేట్‌ వెడ్డింగ్స్‌ లో జరిగే పెళ్లిళ్లలో భారీగా బంగారు ఆభరణాలు వినియోగించడానికి ఎవరూ ఇష్టపడడం లేదని’ ఆయన అంటున్నారు. బ్రైడల్‌ మేకప్‌ ఆర్టిస్టులకూ ఇప్పటి పరిస్థితి పీడకలలా మారింది.  పరిమిత స్థాయిలో దగ్గరి బంధువుల మధ్య సింపుల్‌ వేడుకలతో సరిపెడుతున్నారని దీంతో మేకప్‌ నిపుణుల అవసరం పడడం లేదని నగరానికి చెందిన బ్యూటీషియన్‌ ఉష చెప్పారు. సెప్టెంబర్‌ లేదా అక్టోబరుకు పరిస్థితిలో కొంచెమైనా మార్పొస్తుందని ఆశిస్తున్నామన్నారామె.  

 డెస్టినేషన్‌...నో ఛాన్స్‌.. 
ప్రత్యేకంగా ఒక ప్రాంతాన్ని నిర్ణయించుకుని అక్కడ పెళ్లి చేసుకోవడమనే ఆధునిక డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ ట్రెండ్‌కు కరోనా చావుదెబ్బ కొట్టింది. ఈ ఏడాది నగరం నుంచి ప్లాన్‌ చేసిన దాదాపు అన్ని డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ వాయిదా పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా వ్యాక్సినేటెడ్‌ అయితే గానీ వెడ్డింగ్‌ ట్రావెలింగ్‌ అనేది కోవిడ్‌ ముందు స్థాయికి చేరుకోవడం మనం చూడలేమని, సిటీ నుంచి డ్రైవ్‌ చేసుకునేంత దూరంలో  ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ పరిమితం అవుతాయని సుబ్బయ్య అంచనా వేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement