సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గాందీనగర్‌లో అభివృద్ధి పనుల కోసం శనివారం చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన పురాతన ఆలయ ఆనవాళ్లను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఆలయాన్ని శ్రీ వీరభద్రేశ్వర క్షేత్రంగా, తెలుగు శాసనాన్ని దాన శాసనంగా గుర్తించింది. దాన శాసనంపై చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆదివారం వెల్లడించిన వివరాలివి.
ఆచంద్రార్కం.. అంటే సూర్యచంద్రులు ఉన్నంతకాలం శ్రీవీరభద్రేశ్వర దేవరకు, గర్భగుడిలో నిర్వహించే పూజాదికాలు, ఇతర సేవల నిర్వహణకు వ్యాపారులు విక్రయించే సరుకులపై సుంకం వసూలు చేయాలని నిర్ణయించారు. దేవుని ధూపదీప నైవేద్యాలకు నిత్యం సోలెడు గానుగ నూనె ఉచితంగా ఇవ్వాలని భువనగిరికి చెందిన అష్టాదశ ప్రజలు (పద్దెనిమిది కులాలు) నిర్ణయించారు.
భువనగిరి ప్రజలకు పుణ్యం కలిగేందుకు సుంకం ఇవ్వడానికి వ్యాపారులు, ఉచితంగా నూనె ఇవ్వడానికి అష్టాదశ ప్రజలు ముందుకొచ్చారు. దీనికోసం ఏర్పాటు చేసిందే దాన శాసనమని హరగోపాల్ వివరించారు. మహామండలేశ్వరుడైన కాకతీయ ప్రతాపరుద్ర దేవ మహారాజు పరిపాలనా కాలం శక సంవత్సరం 1240 కాళయుక్తి సంవత్సరం ఆషాడ శుద్ధ 15 పౌర్ణమి గురువారం (క్రీ.శ 1318 జూన్ 14న) దాన శాసనం వేసినట్లు హరగోపాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment