సాక్షి, హైదరాబాద్: దసరా నుంచి ‘ధరణి’ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆస్తుల వివరాలను చకచకా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తోంది. సోమ వారం ప్రారంభించిన ఈ ప్రక్రియను నాలుగైదు రోజుల్లో పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. గుడి అయినా.. బడి అయినా.. అంగన్‌వాడీ, మసీదు మరేదైనా నమోదు చేయాల్సిందేనని పంచాయతీరాజ్‌శాఖ స్పష్టం చేసింది. కట్టడాలే కాకుండా.. పొలాల్లో నిర్మించిన ఫాం హౌస్‌లు, బావుల (పొలాల) దగ్గర నిర్మాణాలను కూడా రికార్డుల్లోకి ఎక్కించాలని ప్రభుత్వం నిర్దేశించింది.
విజయదశమి నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులను వేర్వేరుగా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ఆలోపు ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని పంచాయతీరాజ్‌శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నమోదైన ప్రాపర్టీల జోలికి వెళ్లకుండా.. ఇంకా ఆన్‌లైన్ (ఈ–పంచాయతీ)లో నమోదుకాని కట్టడాలను రికార్డుకెక్కిస్తోంది.
ఆధార్, ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందే..!
ఆస్తుల రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే ఆస్తి బదలాయింపు(మ్యుటేషన్) ప్రక్రియను కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న సర్కారు... ప్రతి ఇంటి యజమాని ఫోన్, ఆధార్ నంబర్ వివరాలను కూడా సేకరిస్తోంది. కేవలం ఈ సమాచారమేగాకుండా.. కుటుంబసభ్యుల పేర్లను కూడా తీసుకుంటోంది. అంతేగాకుండా ఒకవేళ కుటుంబ పెద్ద గనుక మరణిస్తే ఎవరి పేరు మీదకు ఆస్తిని బదలాయించాలనే దానిపైనా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
వారసులు ఒకరికంటే ఎక్కువ ఉంటే ఈ విషయంలో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఇప్పడే స్పష్టత ఇవ్వాలని (సదరు ఆస్తిని ఎవరెవరి పేర్ల మీదకు మార్చాలని) పంచాయతీరాజ్‌శాఖ కోరింది. ఈ మేరకు గ్రామ కార్యదర్శులకు సమాచార సేకరణపై మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ఆ శాఖ... పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్లిపోయిన ఆడపడుచుల స్వీయ ధ్రువపత్రాలను తీసుకోవాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కలిపి ఆస్తి పన్ను చెల్లింపు జాబితాలో మొత్తం 53.43 లక్షల కట్టడాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.
ఖాళీ స్థలాలపై స్పష్టత కరువు
ప్రస్తుతానికి కేవలం కట్టడాలను మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసిన పీఆర్ శాఖ.. ఖాళీ స్థలాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ధరణి అందుబాటులోకి వచ్చేలోగా కట్టడాల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్ధేశంతో తొలి దశలో కేవలం కట్టడాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ప్రతి ఆస్తికి ఒక నంబర్
గ్రామకంఠం, పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, భూదాన్, వక్ఫ్ తదితర ఏ కేటగిరీలోనైనా వెలిసిన నిర్మాణాల వివరాల(కొలతలతో సహా)ను సేకరించాలని స్పష్టం చేసింది. అలాగే వ్యవసాయ భూములలో కట్టుకున్న ఇళ్లకు కూడా నంబర్ ఇచ్చి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించింది. ప్రతి ఇల్లు, ప్రభుత్వ ఆస్తులు, సామాజిక కట్టడాలు, స్మశానవాటిక, వాటర్ ట్యాంకులు, పార్కులు ఇలా ప్రతి ఆస్తికి ఒక నంబర్‌ను కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ ఆస్తుల నమోదు అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాబితాను స్థానిక జీపీల్లో ప్రదర్శించాలని పేర్కొంది. అక్టోబర్ 10లోగా అభ్యంతరాలను స్వీకరించి.. తుది వివరాలను ధరణి వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది. ఈ నమోదు ప్రక్రియలో తప్పులు దొర్లినట్లు తేలితే సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా.. డీపీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.
పురపాలికల్లో నమోదుకు మొబైల్ యాప్!
పురపాలికల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకురానుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆలోగా ప్రతి నిర్మాణానికి సంబంధించిన వివరాలను సేకరించి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించిందని అధికారులు పేర్కొంటున్నారు. ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రభుత్వం నుంచి.ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. యజమానుల ఆధార్ కార్డు ప్రతితో పాటు నిర్మాణానికి సంబంధించిన కొలతలను సేకరించాలని పురపాలికలకు క్షేత్రస్థాయిలో ఆదేశాలు అందాయి.
పురపాలికల్లో ఇలా
సాక్షి, హైదరాబాద్: పురపాలికల్లో వ్యవసాయే తర ఆస్తుల నమోదుకు నిర్వహించే ధరణి సర్వేలో మొత్తం 53 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించనుంది. ఇం దుకు సంబంధించిన ప్రొఫార్మాను పురపాలక శాఖ రూపొందించింది. ఇందులో ప్రధానంగా యజమాని వివరాలు, కుటుంబ సభ్యుల వివ రాలు, ఆస్తి యాజమాన్య హక్కులకు సంబంధిం చిన రుజువులను సేకరించనుంది.
యజమాని ఇవ్వాల్సిన వివరాలు..: టి.పిన్ నంబర్, మదింపు సంఖ్య (అసెస్మెంట్ నంబర్), ఇంటి పేరు, పేరు, లింగం, కులం (ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఓసీ/మైనారిటీలు), తండ్రి పేరు, ఇంటి నంబర్, ప్రాంతం పేరు, మొబైల్ నంబర్, జిల్లా, డివిజన్/వార్డు, మండలం, పురపాలిక పేరు, రెవెన్యూ గ్రామం, జోన్ సంఖ్య, రెవెన్యూవార్డు, బ్లాక్ నంబర్, ప్రాపర్టీ రకం (ఖాళీ స్థలం/ ఇండిపెండెంట్ ఇళ్లు/ అపార్ట్‌మెంట్/ వాణిజ్య భవనం), సర్వే నంబర్, వినియోగం (నివాసం/ వాణిజ్యం/ నివాసం సహా వాణిజ్యం/ పారిశ్రామిక, ప్రభుత్వం), ప్లాట్ విస్తీర్ణం (చదరపు గజాల్లో), నిర్మిత ప్రాంతం (చదరపు అడుగుల్లో), వార్షిక ఆస్తి పన్ను మదింపు విలువ, ఆస్తి సంక్రమణ మూలం (విభజన/ వారసత్వం/ కానుక/ కొనుగోలు), భూమి రకం (ఆబాది/ ప్రైవేటు/ ప్రభుత్వం/ అసైన్మెంట్)
- కుటుంబ సభ్యుల పేర్లు, లింగం, వయస్సు, ఆధార్ సంఖ్య, యజమానితో సంబంధం... వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
- యాజమాన్య రుజువు కాలం కింద పట్టాదార్ పాస్‌బుక్, ఆహార భద్రత కార్డు, జన్‌ధన్ బ్యాంకు ఖాతా, ఆసరా పెన్షన్, జాబ్‌కార్డు, ఆధార్ కార్డు సంఖ్యలను సేకరించనున్నారు.
- వీటితో పాటు యజమాని వయస్సు, ఈ–మెయిల్ ఐడీ, విద్యుత్ సర్వీసు నంబర్, కులాయి నంబర్, ఆస్తి పన్ను మదింపు సంవత్సరం, ఐడెంటిటీ ప్రూఫ్, ఎన్నికల వార్డు, ఇంటినంబర్‌తో సహా చిరునామా , చిరునామా 2, నగరం/పట్టణం/గ్రామం, ల్యాండ్‌మార్కు, రాష్ట్రం, పిన్‌కోడ్ వివరాలను సర్వేలో సేకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment