సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ రాజకీయం వేడెక్కింది. వ్యూహ ప్రతివ్యూహాలతో అన్ని పార్టీలు గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగుతున్నాయి. ఎన్నికల్లో కీలకమైన అభ్యర్థుల ప్రకటన షురూ అయింది..అధికార పార్టీ యమ స్పీడ్‌గా 105 స్థానాలకు పేర్లు ప్రకటించింది. సిట్టింగ్‌లకు పట్టం కట్టింది. 57 మందికి తిరిగి టికెట్లు కేటాయించింది. ఇతర పార్టీల్లోకి మారడం.. ఆసక్తి లేకపోవడం వంటి కారణాలతో నాలుగు సిట్టింగ్ సీట్లలో కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇక సామాజిక సమీకరణల్లోనూ టీఆర్‌ఎస్ సమతూకం పాటించింది. దాదాపు అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఓసీలు 14 మంది, బీసీలు 14, మైనార్టీలు 14, ఎస్సీలు 2, ఎస్టీ ఒకరికి చొప్పున సీట్లు కేటాయించారు. ఇక బీజేపీ బుధవారం రాత్రి 21 మందితో కూడిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. వీరిలో ఓసీలకు 6, బీసీలు 13, ఎస్సీ 1, మైనార్టీలకు ఒకరికి అవకాశం కల్పించారు. కాగా మేయర్ పీఠంపై కన్నేసిన బీజేపీ ‘ఆకర్ష్’ మంత్రాన్ని జపిస్తోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈమేరకు మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్‌లను పార్టీలోకి చేర్చుకుంది. చదవండి: జీహెచ్‌ఎంసీ: తొలి జాబితాలు వచ్చేశాయ్..!
20 నామినేషన్లు
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల తొలిరోజైన బుధవారం 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీజేపీ నుంచి 2 నామినేషన్లు, కాంగ్రెస్ నుంచి 3 నామినేషన్లు, టీఆర్‌ఎస్ నుంచి 6, టీడీపీ 5 నామినేషన్లు, గుర్తింపు పొందిన పార్టీ నుంచి 1 నామినేషన్, స్వతంత్రులు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. డాక్టర్ ఏఎస్‌రావు నగర్, చర్లపల్లి, మల్లాపూర్, చిలుకానగర్, రామంతాపూర్, చైతన్యపురి, రెయిన్‌బజార్, ఈస్ట్ ఆనంద్‌బాగ్, పటాన్‌చెరు, మూసాపేట, బాలానగర్, జీడిమెట్ల వార్డుల నుంచి ఈ నామినేషన్లు దాఖలయ్యాయి.
రూ. 34 లక్షల నగదు స్వాధీనం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే హవాలా నగదు సరఫరాపై దృష్టి సారించారు. రెండు హవాలా కేసుల్లో రూ.34 లక్షల నగదును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ స్వాధీనం చేసుకుంది. సుల్తాన్ బజార్‌లో సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బు తరలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.13 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు.
గీత దాటితే వేటే
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రవర్తన నియమావళిని పాటించాలి. ప్రచారం సందర్భంగా నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులు,తదితర సందర్భాల్లోనూ నియమాలు పాటించాలని ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి అధీకృత అధికారి నుంచి తగిన అనుమతి పొందకుండా ఏ పార్టీ గానీ, అభ్యర్థి గానీ బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదు. అధీకృత స్థానిక అధికారి నుంచి తగిన అనుమతి పొందకుండా ఏ పార్టీ, అభ్యర్థిలౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు. అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు, రోడ్ షోల వద్ద లౌడ్ స్పీకర్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే ఉపయోగించాలి. బహిరంగ ప్రదేశాలలో ఎన్నికల సమావేశాలను నిర్వహించడానికి అనుమతి మంజూరు చేసే విషయంలో సంబంధిత అధికారి అభ్యర్థుల , రాజకీయ పార్టీల మధ్య ఏ విధమైన పక్షపాతాన్ని చూపరాదు.
ఒకే ప్రదేశంలో ఒకే తేదీ, ఒకే సమయంలో సమావేశాలను నిర్వహించడానికి ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీల నుండి అభ్యర్థనలు వచ్చిన సందర్భంలో మొట్టమొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి లేదా పార్టీకి అనుమతిని మంజూరు చేయాలి. ఊరేగింపులకు సంబంధించి ప్రారంభం కావటానికి ముందే తేదీని, ప్రారంభ సమయాన్ని, మార్గాన్ని ,ఊరేగింపు ముగింపు ప్రదేశాన్ని పార్టీ లేదా ఊరేగింపు నిర్వహించే అభ్యర్థి నిర్ణయించి ఎన్నికల అధికారులకు సమర్పించడంతో పాటు దానిని తప్పకుండా పాటించాలి.
కరోనా నిబంధనల మేరకే ఊరేగింపులు..
ఊరేగింపులకు అవసరమైన ఏర్పాట్లను చేయడానికి వీలుగా ఊరేగింపు వివరాలను నిర్వాహకులు స్థానిక పోలీసు అధికారులకు ముందుగా తెలియజేయాలి. ఊరేగింపు మార్గంలో ఏవైనా నిషేదాజ్ఞలు ఉన్నట్లయితే నిర్వాహకులు సంబంధింత అధీకృత అధికారినుంచి ప్రత్యేకంగా సదరు ఆజ్ఞలనుంచి మినహాయింపునకు తగిన అనుమతి పొందాలి. లేని పక్షంలో నిషేధాజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి. ఊరేగింపు కొనసాగే దారిలో నిర్వాహకులు ముందుగా తగిన చర్యలు తీసుకోవాలి. దాని వల్ల ట్రాఫిక్ కు ఏ విధమైన ఆటంకం కలగకుండా ఉంటుంది. ఊరేగింపు చాలా పొడవుగా ఉన్నట్లయితే ఊరేగింపును చిన్న చిన్న నిడివి గల భాగాలుగా విడదీయాలి. ఇందువల్ల ఊరేగింపు కొనసాగే దారిలో ప్రత్యేకించి జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ను దశలవారీగా అనుమతించడానికి వీలవుతుంది. అందువల్ల విపరీతమైన ట్రాఫిక్ రద్దీని నివారించవచ్చును.
ఊరేగింపులు సాధ్యమైనంతవరకు రోడ్డుకు కుడి వైపున వెళ్లే విధంగా క్రమబద్ధీకరించాలి. ఊరేగింపు సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బంది ఆదేశాలను, సలహాలను నిర్వాహకులు ఖచ్చితంగా పాటించాలి. రెండు, అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఒకే రూట్ లో లేదా ఆ రూట్‌కు సంబంధించిన ఒకే మార్గంలో ఒకే సమయంలో ఊరేగింపులు చేయవలసి వస్తే నిర్వాహకులు ఒకరికొకరు ముందుగానే ఈ విషయంపై అవగాహనకు వచ్చి, ఊరేగింపులు ఒకదానికి ఒకటి ఎదురుపడకుండా లేదా ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా సరైన చర్యలు తీసుకోవాలి. సంతృప్తికరమైన ఏర్పాట్లను చేయడానికి స్థానిక పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి. ఇందుకోసం రాజకీయ పార్టీలు ఊరేగింపునకు వీలైనంత ముందుగానే పోలీసులను సంప్రదించాలి. ఊరేగింపులో పాల్గొన్న వ్యక్తులు ఏదైనా వస్తువులను తీసుకువెళ్లే విషయంలో రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థులు పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. ముఖ్యంగా అవాంఛనీయ శక్తులు ఉద్రేకానికి లోనైన సందర్భంలో వీటిని దుర్వినియోగపరిచే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment