‘ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా తప్పుడు సమాచారం’ | HydFactCheck 2022 National Conference At Osmania University | Sakshi
Sakshi News home page

‘ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా తప్పుడు సమాచారం’

Published Sat, Jul 9 2022 8:42 PM | Last Updated on Sat, Jul 9 2022 8:48 PM

HydFactCheck 2022 National Conference At Osmania University - Sakshi

ఉస్మానియా యూనివర్శిటీ: తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించిందని హైదరాబాద్లోని  యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ ఆవేదన వ్యక్తం చేశారు.  మీడియా అందించిన సమాచారం అధారంగా ప్రజలు అభిప్రాయాలను ఏర్పాటు చేసుకుంటారు గనుక.... కలుషితం లేని వాస్తవిక సమాచారాన్ని ప్రజలకు అందించాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై… యూఎస్ కాన్సులేట్ జనరల్, ఉస్మానియా జర్నలిజం విభాగం సంయుక్తంగా ఓయూ సీఎఫ్ఆర్డీ లో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో పాల్గొని డేవిడ్ మోయర్ ప్రసంగించారు. 

దురుద్దేశం లేకపోయినా... దురదృష్టవశాత్తు కొన్ని సార్లు చట్టబద్దమైన మీడియా సంస్థల నుంచే తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతుందని అన్నారు. సమాచార సముద్రంలో ఈదుతున్న పాత్రికేయులు ఒక్కో సందర్భంలో  అబద్ధానికి వాస్తవానికి వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారని.... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  ఇలాంటి పరిస్థితిని కట్టడి చేసుకోవాలని హితవు పలికారు. ఇందుకోసం అందరం కష్టించి పనిచేయాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనే నైపుణ్యాలను అందించేందుకు ముందుకు వచ్చిన ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం విభాగాన్ని ఈ సందర్భంగా మోయర్ అభినందించారు.

ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవటం అత్యవసరమని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. జర్నలిజంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని... ఇందుకు ఉస్మానియా జర్నలిజం విభాగం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి సెషన్స్ ద్వారా బాధ్యతాయుతమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాచార వరద నుంచి వాస్తవాలను జల్లెడ పట్టడానికి క్లిష్టమైన ఆలోచనా పద్దతులను వర్తింపజేయాలని డేటాలీడ్స్  వ్యవస్థాపకుడు, సీఈఓ సయ్యద్ నజాకత్ అన్నారు. 

టెక్నికల్ టూల్స్ పై అతిగా ఆధారపడటం కన్నా... పరిశీలనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం మంచిదని బూమ్ లైవ్ దక్షిణాది న్యూస్ ఎడిటర్ నివేదిత నిరంజన్ కుమార్ జర్నలిస్టులకు సూచించారు. తప్పుడు సమాచారం, అభిప్రాయం, హాస్యాలకు వ్యత్యాసం ఏమిటో గుర్తించాలని చెప్పారు. ఏదైనా సమాచారానికి సంబంధించి అది అబద్ధమా, లేదా సందర్భం మారిందా,  వ్యంగమా గమనించాలని స్పష్టం చేశారు. కేవలం వైరల్ అయిన సమాచారానికి మాత్రమే కాకుండా ప్రతి చిన్న సమాచారానికి కూడా ఫ్యాక్ట్ చెక్ అవసరమని వివరించారు. ఓయూ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె. నరెందర్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కె. స్టీవెన్ సన్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. 

ప్రముఖ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి, ప్యాక్ట్ చెకర్ సత్యప్రియ రచించిన ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకాన్ని డేవిడ్ మోయర్‌తో కలిసి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ విడుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement