CM KCR Comments On Congress And BJP Parties At BRS Khammam Public Meeting - Sakshi
Sakshi News home page

భారత జాతి విముక్తి కోసమే బీఆర్‌ఎస్‌!

Published Thu, Jan 19 2023 1:01 AM | Last Updated on Thu, Jan 19 2023 9:39 AM

KCR Comments On Congress Party And BJP - Sakshi

ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగసభకు హాజరైన జన సందోహం

మీది ప్రైవేటైజేషన్‌.. మాది నేషనలైజేషన్‌ 
ఏదైనా నష్టమొస్తే సమాజం నెత్తిన రుద్దడం. ధరలు పెంచి, సామాన్య ప్రజల మీద ట్యాక్స్‌లు వేయడం.. అదే లాభం వస్తే ప్రైవేట్‌దారులకు దోచిపెట్టడం.. ఇది బీజేపీ విధానం. వారు చెప్పే నీతి. అయ్యా ప్రధాని మోదీ గారు.. మీ పాలసీ ప్రైవేటైజేషన్‌.. మా పాలసీ నేషనలైజేషన్‌.. రైళ్లు పోయినై.. విమానాలు పోయినై.. చివరకు వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్‌ చేస్తరట. మన భూములను కార్పొరేట్‌ గద్దలకు ఇచ్చి.. మనమే వారి వద్ద జీతాలు తీసుకునే పరిస్థితికి తెస్తున్నారు. 
– సీఎం కేసీఆర్‌ 

అమ్మేయ్‌.. వాపస్‌ తెస్తాం..
ఎల్‌ఐసీకి రూ.48 లక్షల కోట్ల ఆస్తులు, లక్షలాది మంది ఏజెంట్లు, ఉద్యోగులు ఉన్నారు. అప్పనంగా అడ్డికి పావుసేరుగా దానిని షావుకార్లకు అమ్ముదామని చూస్తున్నావు. నువ్వు అమ్మినా గ్యారెంటీగా మళ్లీ ఎల్‌ఐసీని వాపస్‌ చేసుకుంటాం. పబ్లిక్‌ సెక్టార్‌లోనే కొనసాగిస్తాం. మోదీ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతా అంటున్నారు. మేం మళ్లీ విశాఖ ఉక్కును పబ్లిక్‌ సెక్టార్‌లోకి తెస్తాం. మోదీ ఇవాళ అమ్ముతా, అమ్ముతా అంటున్నావ్‌. అమ్మేయ్‌.. ఫర్వాలేదు. 2024 తర్వాత నువ్వు ఇంటికి.. మేము ఢిల్లీకి..

కొన్నిరోజుల్లోనే బీఆర్‌ఎస్‌ పాలసీ 
కేజ్రీవాల్, భగవంత్‌సింగ్‌మాన్, అఖిలేశ్‌ యాదవ్, విజయన్, రాజా, ఇతర నేతలు మాకు సంఘీభావాన్ని, ఎంతో బలాన్ని ఇచ్చారు. కొన్నిరోజుల్లోనే బీఆర్‌ఎస్‌ పాలసీని ప్రజల ముందు పెడతాం. మా పాలసీపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు, మాజీ సుప్రీంకోర్టు జడ్జీ లు 100 మంది దాకా పనిచేస్తున్నారు. ఫైనల్‌ డ్రాఫ్టింగ్‌ జరుగుతోంది. చర్చకు పెడతాం. సీపీఎం, సీపీఐ వంటి ప్రగతిశీల పార్టీలతో దేశవ్యాప్తంగా కలసి పనిచేస్తాం. అంతిమ విజయం మనదే.. న్యాయం, ధర్మం గెలుస్తుంది.  

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భారతదేశ దుస్థితికి, ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలకు కేంద్రాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలే కారణమని.. భారత జాతిని విముక్తం చేయడం కోసమే బీఆర్‌ఎస్‌ పుట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. దేశంలో విస్తృతమైన వ్యవసాయ భూమి, 70 వేల టీఎంసీల నీళ్లు, అవసరానికి మించిన కరెంటు ఉత్పత్తి ఉన్నా.. వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితిలో ఉందని మండిపడ్డారు. ‘భయ్యా హమ్‌నే కర్‌ దియా.. ఉన్హోనే రోక్‌ దియా..’ అంటూ కాంగ్రెస్‌ ఉంటే బీజేపీని తిట్టడం, బీజేపీ ఉంటే కాంగ్రెస్‌ను తిట్టడమే సరిపోయిందన్నారు. మనకు కావాల్సింది ఇది కాదని.. ఈ చైతన్యం తేవడానికి, ప్రశ్నించడానికే బీఆర్‌ఎస్‌ వస్తోందని ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ అరగంటకుపైగా ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘రాజకీయాల్లో ఎందరో గెలిచారు. ఎందరో ఓడారు. ఇది పెద్ద విషయం కాదు. కానీ ఈరోజు మన దేశం, సమాజం లక్ష్యం ఏమిటి? దేశం దారి తప్పిందా? తన లక్ష్యాన్ని కోల్పోయిందా? దారి తప్పిందా? ఏం జరుగుతోంది ఈ దేశంలో..? అనే ప్రశ్నలు నా అంతరాత్మను అనేక రోజులుగా కలచివేస్తున్నాయి. దయచేసి మనమందరం సీరియస్‌గా ఆలోచించాల్సిన విషయం ఒక్కటే. ఎవరినీ అడుక్కునే అవసరం లేని.. ప్రపంచ బ్యాంకు అప్పు అవసరం లేని.. ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేని.. ఏ విదేశీయుల సాయం తీసుకోవాల్సిన అవసరం లేని సహజ సంపద మన దేశ ప్రజల సొత్తు. లక్షల కోట్ల ఆస్తి ఉంది. అదంతా ఏమవుతోంది? ఏదీలేక భిక్షమెత్తుకుంటే ఫర్వాలేదు. ఉండి కూడా ఎందుకు యాచకులం కావాలి? 
ఖమ్మం సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌. వేదికపై నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, కె.కేశవరావు, పువ్వాడ అజయ్‌కుమార్, హరీశ్‌రావు, అఖిలేశ్‌యాదవ్, భగవంత్‌సింగ్‌ మాన్, కేజ్రీవాల్, డి.రాజా, పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని, తమ్మినేని, సత్యవతి రాథోడ్, సబితారెడ్డి, కవిత, జగదీశ్‌రెడ్డి, వినోద్‌కుమార్, రేగా కాంతారావు   

అన్నీ ఉన్నా.. దిగుమతులా? 
అమెరికా విస్తీర్ణంలో మనకంటే రెండున్నర రెట్లు పెద్దగా ఉంటుంది. కానీ వాళ్లకున్న వ్యవసాయ భూమి 29 శాతమే. చైనా మనకంటే ఒకటిన్నర రెట్లు పెద్దది. వాళ్లకున్న వ్యవసాయ భూమి 16 శాతమే. అదే భారతదేశంలో సగం భూమి అంటే.. 41 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలమైన భూమి ఉంది. అపారమైన జల సంపద ఉంది. ఏటా వానలతో 1.4 లక్షల టీఎంసీల నీళ్లు చేరుతాయి. సగం ఆవిరైపోయినా 70– 75 వేల టీఎంసీల నీళ్లు ఉంటాయి.

పంటలు పండటానికి అవసరమైన సూర్యరశ్మి ఉంటుంది. సముద్ర తీరప్రాంతాల్లో ఉండే హ్యుమిడ్‌ (తేమతో కూడిన) వాతావరణం.. సముద్ర తీరం లేని తెలంగాణ, మధ్యప్రదేశ్, యూపీ, ఢిల్లీ వంటి ల్యాండ్‌ లాక్‌డ్‌ భూములు.. పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్, కశ్మీర్‌ లాంటి శీతల రాష్ట్రాలు.. మూడు రకాల అద్భుతమైన ఆగ్రో క్లైమేటిక్‌ జోన్లు ఉన్నాయి.

ఇండియాలో యాపిల్‌ కూడా పండుతుంది.. మామిడి కూడా పండుతుంది. కష్టించి పనిచేసే 139 కోట్ల జనాభా ఉంది. ఇన్ని ఉన్న దేశంలో మెక్‌డోనాల్డ్‌ పిజ్జాలు, మెక్‌డొనాల్డ్‌ బర్గర్లా మనం తినేది. సాగునీటితో అద్భుతమైన పంటలు పండించి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ పెట్టి, కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి, బెస్ట్‌ ఫుడ్‌చైన్‌ ఆఫ్‌ వరల్డ్‌గా ఇండియా ఉండాల్సి ఉంది. కానీ కెనడా నుంచి కందిపప్పు తెచ్చుకుంటున్నాం.. లక్ష కోట్ల విలువైన పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం.. ఇంత కన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా? 

ఎవరిదీ పాపం? 
సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారమే.. దేశంలో 75వేల టీఎంసీల నీళ్లుంటే.. వాడుకుంటున్నది నికరంగా 19 వేల టీఎంసీలే. మరోవైపు కోట్లాది మందికి ఈ రోజుకూ విషపు మంచినీళ్లే గతి. దీనికి ఎవరు బాధ్యులు? ఎవరిదీ పాపం? స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో వేసిన కొన్ని ప్రణాళికలు, కట్టిన కొన్ని ప్రాజెక్టులు తప్ప తర్వాత అతీగతీ లేదు. కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ వేసి 20 ఏళ్లు గడుస్తున్నా ఏమీ తేలలేదు. ఆ జడ్జి ముసలివాడయ్యారు.

నలుగురు తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు. ఆయన ఎప్పుడు హరీ అంటారో ఎవరికీ తెలియదు. ఆయన తీర్పు చెప్పేది ఎప్పుడు? తర్వాత క్లియర్‌ చేసేదెప్పుడు? డిజైన్లు ఎప్పుడు, నిధులు సమకూరేదెప్పుడు, ప్రాజెక్టులు కట్టేదెప్పుడు.. ప్రజలకు సాగునీరు, తాగునీరు వచ్చేది ఇంకెప్పుడు? దీనికేమన్నా అంతర్జాతీయ రాజనీతి కావాలా? ప్రపంచబ్యాంకు దగ్గర చిప్ప పట్టుకోవాలా? కాదుకదా.. నదుల్లో నీరు సముద్రం పాలవుతుంటే నోరెళ్లబెట్టుకుని కూర్చుని కహానీలు, కథలు చెప్పి.. ప్రజలను గోల్‌మాల్‌ చేస్తున్నారు. 

నీటి యుద్ధాలు ఆగాలి 
సట్లేజ్‌ దాని ఉప నదులపై పంజాబ్, హరియాణా రోజూ తన్నుకుంటూ ఉంటాయి. మహానది నీళ్ల కోసం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ యుద్ధం, నర్మద జలాల కోసం గుజరాత్, మధ్యప్రదేశ్‌ మధ్య కొట్లాట, కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటక గొడవ.. గోదావరి, కృష్ణాల మీద మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రా పంచాయితీ.. ఇవి ఇలా కొనసాగుతూనే ఉండాలా? పాలన చేతగాక, చట్టస్ఫూర్తి లేక డొల్ల మాటలు, కల్లబొల్లి కబుర్లు చెప్పే పాలకులే ఉండాలా? 

ఆ డబ్బా రేకుల మాటలు విందామా? 
కరెంట్‌ ఇవ్వలేరు.. మంచినీరు ఇవ్వలేరు. వారి డబ్బా రేకుల మాటలు విందామా? దేశంలో కోస్గి, గండకి నదులతో సగం బీహార్‌ వరదలతో, సగం కరువుతో అల్లాడుతున్నాయి. అక్కడ ప్రాజెక్టు కడితే బ్రహ్మాండంగా కరెంట్‌ వచ్చేది. ఇలాంటివి పట్టించుకోకుండా.. ఈ దేశంలో ప్రజలను మోసగించడానికి, గోల్‌మాల్‌ చేయడానికి ప్రధాని మోదీ కబుర్లు చెప్తారు. బీజేపీ తమ వైఫల్యాలు, అసమర్థతను, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మత విద్వేషాలను రేపుతోంది. మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తోంది. మత విద్వేషం దేశాన్ని దహించి వేస్తుంటే ఎందుకు సహించాలి?  

దేశమంతా ఉచిత కరెంటు ఇస్తాం 
దేశంలో అందుబాటులో ఉన్న కరెంటు 4.10 లక్షల మెగావాట్లు. దేశంలో ఏ రోజు కూడా 2.10 లక్షలకు మెగావాట్లకు మించి వాడలేదు. అయినా ఒక్క తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లో కరెంట్‌ కోతలే. బీఆర్‌ఎస్‌ వంటి భావజాలం ఉన్న పార్టీలు అధికారంలోకి వస్తే.. మన తెలంగాణలా రెండేళ్లలో వెలుగు జిలుగులతో భారతదేశం వెలిగిపోతుంది. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని అడిగితే దాని మీద 96 కథలు చెప్పారు. ఇదేనా దేశాన్ని పాలించే తీరు. మొత్తం దేశమంతటా తెలంగాణ తరహాలో ఉచిత కరెంట్‌ ఇవ్వాలి. దీనికి అయ్యే ఖర్చు లక్షా 45 వేల కోట్లు మాత్రమే. రేపు బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్, లేదా ప్రతిపాదించే గవర్నమెంట్‌ వస్తే దేశం మొత్తానికి ఉచిత కరెంట్‌ సరఫరా చేస్తాం. 

దేశమంతా దళితబంధు ఇవ్వాలి 
లాభం ఉన్నవారు పేదలను ఆదుకోవడం అనాదిగా ఉన్న సంప్రదాయం. ధనవంతులు ధర్మశాలలు కట్టించడం సంప్రదాయం. కానీ పేదలను షావుకార్లకు అప్పగించి చావగొడతరా? దళిత బిడ్డలు ఎవరికోసం వివక్ష అనుభవించాలి? అందుకే తెలంగాణలో దళితబంధు పథకం పుట్టింది. అంబేడ్కర్, కాన్షీరామ్‌లు చూపిన బాటలో దళితజాతి పైకి వచ్చి తీరాలి. తెలంగాణ దళితబంధు వంటి పథకాన్ని ఏటా 25 లక్షల కుటుంబాల చొప్పున దేశమంతటా అమలు చేయాలి. మీరు చేయకపోతే మేం వచ్చాక చేసి చూపెడతాం.  

మహిళలపై వివక్ష పోవాలి 
ఏ సమాజంలో మహిళలను అన్ని రంగాల్లోకి ఆహ్వానించారో అక్కడ అభివృద్ధి జరుగుతోంది. ఎంత తెలివున్నా నువ్వు వంటింట్లోనే ఉండు, మేం బలాదూర్‌ తిరుగుతామనే పద్ధతి దేశం ఉంది. ఈ లింగ వివక్ష పోవాలి. మహిళల పాత్రను అన్ని రంగాల్లో పెంపొందించాలి. వారికి చట్టసభల్లో రిజర్వేషన్‌ను కూడా బీఆర్‌ఎస్‌ ప్రతిపాదిస్తోంది. 

అసమర్థ పాలనను తొలగిద్దాం
కేంద్రంలో విపక్షాల ప్రభుత్వం రాగానే మిషన్‌ భగీరథ తరహాలో దేశమంతా ప్రతి ఇంటికి శుద్ధమైన మంచినీళ్లు ఇస్తాం. సైన్యంలో నియామకం అంటే ఒక పద్ధతి ఉండాలి. దానిలో కూడా వేలు పెట్టి తెలివి తక్కువ విధానం తెచ్చారు. విపక్షాల ప్రభుత్వం ఈ అగ్నిపథ్‌ను రద్దు చేస్తుంది. పాత పద్ధతిలోనే నియామకాలు కొనసాగిస్తాం. రైతులు, మహిళలు, కార్మికులు, దళిత బిడ్డలు అందరం ఒక్కటైతే అసమర్థ పాలనను తొలగించడం కష్టమేం కాదు. ఉజ్వలమైన భారతదేశం ఆవిష్కరించడానికే బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది..’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.  

మనకెందుకు భారీ ప్రాజెక్టుల్లేవు? 
జింబాబ్వే అనే చిన్న దేశంలో జాంబేజీ నది మీద 6,533 టీఎంసీల భారీ రిజర్వాయర్‌ ఉంది. రష్యాలో అంగారా నది మీద 5,968 టీఎంసీలతో.. ఘనాలోని ఓల్టా నది మీద 5,085 టీఎంసీలతో.. కెనడాలో మనికుగాన్‌ నది మీద 4,944 టీఎంసీలతో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈజిప్టులో నైలునది మీద ప్రాజెక్టు, చైనాలో యాంగ్జి నది మీద, అమెరికాలో కొలరాడో మీద భారీ రిజర్వాయర్లు ఉన్నాయి.

మరి మన దేశానికి అలాంటిది ఏది? ఇంత సువిశాల దేశం, 139 కోట్ల జనాభా, కరువులు, కాటకాలు చూసినం, వరదలు చూస్తున్నం.. ఒక్కటైనా పెద్ద ప్రాజెక్టు కట్టి నీళ్లు వాడుకోలేమా? నదుల నీళ్లు మళ్లించుకుని ప్రజల దాహం తీర్చుకోవద్దా? మనం సన్నాసుల్లా ఉండాలా? దేశం ఆలోచించాలి. ఇది ప్రశ్నించడానికి, చైతన్యం తేవడానికి పుట్టిందే బీఆర్‌ఎస్‌. తెలంగాణ తరహాలో దేశవ్యాప్త ఉద్యమం తెచ్చి అయినా సరే.. కేంద్రం మెడలు వంచాలి. పోరాటం జరగాలి. లేకపోతే మనం ముందుకు పోలేం. 

రెండో విడత కంటి వెలుగు షురూ 
రాష్ట్రంలో రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని, ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను.. కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు పినరయి విజయన్, అరవింద్‌ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాలతో కలిసి సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రారంభించారు. తొలుత నేతలంతా యాదాద్రి నుంచి రెండు హెలికాప్టర్లలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం వద్ద నిర్మించిన కొత్త కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు.

ప్రత్యేక పూజా కార్యక్రమాల మధ్య కలెక్టరేట్‌ను ప్రారంభించారు. తర్వాత కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను చాంబర్‌లోని సీట్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఖమ్మంలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత కేసీఆర్, ఇతర సీఎంలు, నేతలు కలిసి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఎంపిక చేసి, కంటి పరీక్షలు పూర్తయిన ఆరుగురు లబ్ధిదారులకు.. ఆరుగురు అతిథుల చేతుల మీదుగా కంటి అద్దాలను అందజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement