క్రేన్లు, డీసీఎంలు వినియోగించి అపహరణ
ఆపై స్క్రాప్ దుకాణానికి విక్రయం
ఘరానా ముఠాకు పోలీసుల చెక్
నలుగురు నిందితుల అరెస్టు
జీడిమెట్ల: సైకిళ్లు, బైకులు, కార్లను అపహరించే చోరులు పోలీసులకు చిక్కుతూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో లారీలు, కంటైనర్ దొంగలూ దొరుకుతారు. గురువారం జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసిన వారి రూటే సెపరేటు. వీళ్లు ఏకంగా రోడ్ రోలర్లను తస్కరించి కటకటాల్లోకి చేరారు. క్రేన్లు, డీసీఎం వాహనాల సాయంతో ఈ దొంగతనాలు చేసి, స్క్రాప్ దుకాణాలకు విక్రయిస్తున్నట్లు బాలానగర్ డీసీపీ కె.సురేష్‌కుమార్ తెలిపారు. ఏసీపీ హన్మంతరావుతో కలిసి గురువారం జీడిమెట్ల ఠాణాలో ఏర్పాటు చేసిన సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని కలబురిగి (గుల్బర్గా), సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌కు చెందిన అఫ్రోజ్ అహ్మద్ (గ్యాస్ కట్టర్), మహ్మద్ ఇబ్రహీం (స్క్రాప్ వ్యాపారి), సయ్యద్ ముస్తాఫా స్నేహితులు. ప్రస్తుతం వీరంతా బాలానగర్‌లోని రాజు కాలనీలో నివసిస్తున్నారు. తమకు వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ, విలాసాలు కష్టం కావడంతో తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషించారు.
పార్క్ చేసి ఉండగా..
ఇందులో భాగంగా జీడిమెట్ల పారిశ్రామిక వాడతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. దూలపల్లి రోడ్డులో పార్క్ చేసి ఉన్న రోడ్ రోలర్‌పై వీరి కన్నుపడింది. దాని యజమాని, డ్రైవర్ సైతం సమీపంలో లేకపోవడాన్ని అనుకూలంగా మార్చుకోవాలని భావించారు. కుత్బుల్లాపూర్‌నకు చెందిన డీసీఎం వాహన యజమాని, డ్రైవర్ షేక్ అన్వర్‌తో కలిసి సోమవారం రాత్రి రోడ్ రోలర్ దగ్గరకు చేరుకున్నారు. ఆపై కుత్బుల్లాపూర్ ప్రాంతానికే చెందిన క్రేన్ల యజమాని బి.రామ్ సత్యనారాయణను సంప్రదించి రెండు క్రేన్లు దూలపల్లి రోడ్‌లోకి రప్పించుకున్నారు.
స్థానికుల సమాచారంతో..
క్రేన్ల సాయంతో రోడ్ రోలర్‌ని డీసీఎం వ్యాన్‌లోకి ఎక్కించి ఉడాయించే ప్రయత్నం చేశారు. రోడ్ రోలర్‌కు లక్ష్మణ్ డ్రైవర్‌గా వ్యవహరిస్తుంటాడని, జీడిమెట్లలోని ఓ టింబర్ డిపోలో పని చేసి అక్కడ పార్క్ చేశాడని స్థానికులకు సమాచారం ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు వ్యాన్‌లో రోడ్ రోలర్ తీసుకువెళ్తుండటంతో వారికి అనుమానం వచి్చంది. దీంతో అప్రమత్తమైన జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణం స్పందించిన అధికారులు డీసీఎం వాహనాన్ని వెంటాడి పట్టుకున్నారు. అందులో ఉన్న అన్వర్‌ను విచారించగా.. మిగిలిన నలుగురి పేర్లు వెలుగులోకి వచ్చాయి.
గతంలోనూ ఓ రోడ్ రోలర్ చోరీ..
ఈ ముఠా గతంలోనూ పేట్ బషీరాబాద్ పరిధి నుంచీ ఓ రోలర్‌ను చోరీ చేసిందని, దాన్ని గ్యాస్ కట్టర్లు వినియోగించి ముక్కలు చేయడంతో పాటు వాటిని మహారాష్ట్రలోని జాల్నాలో ఉన్న స్క్రాప్ వ్యాపారికి అమ్మిందని వెలుగులోకి వచ్చింది. నిందితుల కోసం గాలించిన పోలీసులు ముస్తాఫా మినహా మిగిలిన వారిని పట్టుకుని క్రేన్లు, డీసీఎంతో పాటు రోడ్ రోటర్ స్వా«దీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య, ఎస్సై శ్యాంబాబు, హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్, కానిస్టేబుళ్లు కేవీ సుబ్బారావు, ఎస్.ఆంజనేయులు, టి.సాయి ఫణీంద్రలను డీసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment