పోలీస్‌ కొలువుకు మూడు టెక్నిక్‌లు.. పర్ఫెక్ట్, నాలెడ్జ్, స్మార్ట్‌ | Telangana: Senior IPS Officer Parimala Hana Nutan Advices For Police Candidates | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కొలువుకు మూడు టెక్నిక్‌లు.. పర్ఫెక్ట్, నాలెడ్జ్, స్మార్ట్‌

Published Sat, Apr 30 2022 2:51 AM | Last Updated on Sat, Apr 30 2022 11:50 AM

Telangana: Senior IPS Officer Parimala Hana Nutan Advices For Police Candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ ఉద్యోగం అన్ని ప్రభుత్వం ఉద్యోగాల మాదిరి కాదని, ప్రతీ క్షణం అప్రమత్తతతోపాటు చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పరిమళా హనా నూతన్‌ అభిప్రాయ పడ్డారు. అందుకే అభ్యర్థులు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం అని భావించకుండా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనేలా, ఒత్తిడి తట్టుకొని పనిచేసేలా మానసికంగా దృఢంగా ఉండాలని ఆమె సూచించారు. పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా, పోలీస్‌ అకాడమీలో జాయింట్‌ డైరెక్టర్‌గా అనుభవమున్న పరిమళా హనా నూతన్‌ పోలీస్‌ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పలు అంశాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. అవి మాటల్లోనే...

పాజిటివ్‌ దృక్పథంతో..
పోలీసు ఉద్యోగాలకు ప్రిపరేషన్‌ రెండు రకాలుగా ఉంటుం ది. భయపడకుండా సమయాన్ని బట్టి రాతపరీక్షతోపాటు దేహదారుఢ్య పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. ప్రతీ క్షణం ఉద్యోగం సాధిస్తామనే పాజిటివ్‌ దృక్పథంతో ఆలోచిస్తూ అడుగువేయాలి. బలమైన సంకల్పంతో ప్రతీ సబ్జెక్టును శ్రద్ధపెట్టి చదవాలి. రావడంలేదు.. అర్థంకావడంలేదు అనే భావనను దరిచేరనీయొద్దు.

24 గంటలూ పుస్తకాలు పట్టుకొని వేలాడాల్సిన అవసరంలేదు. చదివిన కొద్ది గంటలైనా శ్రద్ధపెట్టి చదివితే సబ్జెక్టు అర్థమవుతుంది. గుర్తుండి పోతుంది. పర్ఫెక్ట్‌ (ఆయా అంశాలపై సందిగ్ధత లేకుండా స్పష్టతతో), నాలెడ్జ్‌ (బట్టిపట్టకుండా పరిజ్ఞానం పెంచుకోవడం), స్మార్ట్‌ (చాకచక్యంగా తక్కువ సమయంలో ఎక్కువ ప్రిపరేషన్‌ అయ్యేలా).. అనే మూడు టెక్నిక్స్‌తో ప్రణాళిక వేసుకుంటే ఉద్యోగాన్ని సులువుగా కొట్టొచ్చు.

సాంకేతిక రంగం నుంచి వచ్చే వాళ్లకు...
యావత్‌ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతుండటంతో నేరాల నియంత్రణలో సాంకేతికత వినియోగం అత్యంత కీలకమైంది. అందువల్ల టెక్నాలజీ రంగం నుంచి వచ్చిన వారికి పోలీస్‌ ఉద్యోగం అదనపు బలమవుతుంది. అయితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు ఉన్నంత వెసులుబాటు పోలీస్‌ ఉద్యోగాల్లో ఉండదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మానసికంగా సన్నద్ధులై ఉద్యోగంలోకి రావాలి. ఐటీసీ విభాగాలకు ప్రిపేరయ్యే వాళ్లు శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం అంశాల్లో బేసిక్స్‌తోపాటు ప్రొఫెషనలిజం అంశాలపై కొంత దృష్టి పెట్టాలి. 

అర్థమెటిక్, రీజనింగ్‌కు...
ఎస్‌ఐ ఉద్యోగమైనా, కానిస్టేబుల్‌ అయినా ఫండమెంటల్‌ బేసిక్స్‌పై దృష్టిసారించాలి. అర్థమెటిక్, రీజనింగ్‌లాంటి సబ్జెక్టులకు కొంత అధిక సమయం కేటాయించాలి. లాజికల్‌ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి సమస్యను పరిష్కరించే టెక్నిక్‌ను పట్టగలిగితే ప్రిపరేషన్‌ సులభతరం అవుతుంది. బట్టిపట్ట కుండా కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోగలిగితే రాతపరీక్షను అనుకున్న సమయంలో తప్పులు లేకుండా రాయొచ్చు. అదేవిధంగా జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ తదితర అంశాలపై కూడా ఫోకస్‌ చేయాలి. తెలంగాణ చరిత్ర, పోరాటం తదితర అంశాలనూ చదవాలి.

ఒకేసారి 800 మీటర్లు వెళ్లొదు.
పురుషులతో పోలిస్తే మహిళలు ఏ రంగంలోనూ వెనుకబడి లేరు. కాబట్టి ఇంట్లో పనులు, పిల్లలు, బాధ్యతలు ఎన్ని ఉన్నా గట్టి నిర్ణయంతో మహిళలు ముందడుగు వేస్తే తిరుగుండదు. ప్రిపరేషన్‌ కోసం ఒక షెడ్యూల్‌ పెట్టుకోవాలి, అవసరమైతే ఇంట్లో పనులను కుటుంబీకులకు అప్పజెప్పి పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. దేహదారుఢ్య పరీక్షలు కూడా కీలకం కాబట్టి ఒక క్రమపద్ధతిలో ప్రాక్టీస్‌ చేయాలి. మొదటి రోజు 300 మీటర్ల నుంచి పరుగు పందెం ప్రారంభించి క్రమక్రమంగా పెంచాలి.

అతి వేగంగా పరిగెత్తాలని భావించి ఒకేసారి 800 మీటర్లు వెళ్లకూడదు. మెల్లమెల్లగా దూరాన్ని పెంచుతూ ప్రయత్నిస్తే శరీరం కూడా సహకరిస్తుంది. 5 నిమిషాల 20 సెకన్లలో చేరేలాగా చూసుకుంటే సరిపోతుంది. లాంగ్‌ జంప్, షార్ట్‌ పుట్‌కు టెక్నిక్స్‌ అవసరముంటాయి, నిపుణుల వద్ద శిక్షణ తీసుకుంటే అవి పెద్ద సమస్య కాదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement