![సమావేశంలో మాట్లాడుతున్న సీఈఓ శంకర్‌బాబు - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/20/19vgr21-410006_mr_0.jpg.webp?itok=5kXCEizw)
సమావేశంలో మాట్లాడుతున్న సీఈఓ శంకర్‌బాబు
● 40,792 మంది ఖాతాల్లో రూ.30.36 కోట్లు జమ
తిరుపతి అర్బన్ : పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకాన్ని అమలు చేస్తోంది. అందులో భాగంగా ఆదివారం ఎన్‌టీఆర్ జిల్లా తిరువూరు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది తొలి త్రైమాసిక నగదును బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. తిరుపతి కలెక్టరేట్‌లో ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి చెన్నయ్య జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా విద్యాదీవెన కింద మొత్తం 40,792 మంది లబ్ధి చేకూరుతోందన్నారు. దాదాపు రూ.30.36 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాలోకి జమ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి భాస్కర్‌రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ‘స్పందన’
తిరుపతి అర్బన్ : ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. స్పందనకు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. అర్జీదారుల కోసం తిరుపతి సెంట్రల్ బస్టాండ్ నుంచి బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు వివరించారు. అలాగే వినతులు రాసేందుకు ప్రత్యేకంగా ముగ్గురు వీఆర్‌ఓలను నియమించామన్నారు. అలాగే అన్ని సచివాలయాల్లో రోజూ తప్పనిసరిగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు.
ముక్కంటి ఆలయంలో భక్తుల రద్దీ
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామి, అమ్మవార్లను సుమారు 25వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. రూ.200 టికెట్ల ద్వారా 980మంది, రూ.50 టికెట్ల ద్వారా 2,474మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. రూ.500 రాహుకేతు పూజా టికెట్లను 2,816 మంది, రూ.750 టికెట్లను 1,182, రూ.1,500 టికెట్లను 246, రూ.2,500 టికెట్లను 230, రూ.5వేలు టికెట్లను 64మంది భక్తులు కొనుగోలు చేసినట్లు వివరించారు.
రైతు రుణాలకు ‘సహకారం’
వెంకటగిరి: రైతులకు సహకార బ్యాంకుల్లో విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నట్లు బ్యాంకు సీఈఓ సి.శంకర్‌బాబు తెలిపారు. ఆదివారం పట్టణంలోని వెంకటగిరి పీఏసీఎస్ సొసైటీలో బంగారు ఆభరణాలను భద్రపరిచేందుకు లాకర్‌ను ప్రారంభించారు. అనంతరం సీఈఓ మాట్లాడుతూ గ్రామాల్లోని సహకార బ్యాంకుల్లో బంగారు నగలపై రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలోని 25 బ్యాంకుల్లో ఈ వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నామన్నారు. రైతులు ప్రతి ఆరునెలలకు ఒకసారి రుణాలను చెల్లించే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే గృహ, వాహన రుణాలను సైతం మంజూరు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు కాల్తీరెడ్డి శ్రీనివాసులరెడ్డి, యాతలూరు సొసైటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, మొగళ్లగుంట సర్పంచ్ కాల్తీరెడ్డి శ్రీశబరి, సభ్యులు చెంచయ్య, చిన్న సుబ్బమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు తంబిరెడ్డి శివారెడ్డి, సదారెడ్డి, బ్యాంకు ఏజీఎం రమేష్‌బాబు, ప్రదీప్, మేనేజర్ రాజా పాల్గొన్నారు.
![వెంకటరమణారెడ్డి,కలెక్టర్ 1](https://www.sakshi.com/gallery_images/2023/03/20/19tpl50-300079_mr.jpg)
వెంకటరమణారెడ్డి,కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment